
బలవంతపు భూసేకరణ దారుణం
మాట్లాడుతున్న అజయ్‌కుమార్
ఉదయగిరి: పరిశ్రమల పేరిట రాష్ట్రంలోని రైతుల నుంచి భూములను బలవంతంగా సేకరించేందుకు ప్రభుత్వం యత్నిస్తుండటం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అజయ్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌లో కార్యకర్తలతో సమావేశాన్ని గురువారం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు, ప్రజల పొట్టగొట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. కరేడులో ఇండోసోల్ కంపెనీకి ఎనిమిది వేల ఎకరాలను కట్టబెట్టేందుకు యత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. తమ భూములను ఇవ్వబోమంటూ నెల రోజులుగా రైతులు, ప్రజలు పోరాటాలు చేస్తున్నా, ప్రభుత్వంలో కనీస స్పందన లేకపోవడం దారుణమన్నారు. లింగసముద్రం మండలం మాలకొండ ఆలయం చుట్టూ ఉన్న నాలుగు గ్రామాల పరిసర భూముల్లో 19 చదరపు కిలోమీటర్ల మేర ఇనుప ఖనిజం ఉందని, వీటిని జిందాల్ కంపెనీకి కట్టబెట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. వరికుంటపాడు పంచాయతీ జంగంరెడ్డిపల్లె తిప్పపై ఇచ్చిన మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని సంఘాలతో కలిసి చలో కరేడు కార్యక్రమాన్ని ఈ నెల 18న నిర్వహించనున్నామని వెల్లడించారు. సీపీఎం నేతలు కాకు వెంకటయ్య, కోడె రమణయ్య, ఫరిద్దీన్‌బాషా, వెంకటేశ్వర్లు, కామాక్షమ్మ తదితరులు పాల్గొన్నారు.