
18న చలో కరేడు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన తలపెట్టిన చలో కరేడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పిలుపునిచ్చారు. నెల్లూరులోని బాలాజీనగర్‌లో ఉన్న ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూములు ఇచ్చేది లేదని గ్రామసభలో రైతులు తే ల్చిచెప్పారన్నారు. అయితే ఎమ్మెల్యే, కలెక్టర్ గ్రామ రైతుల మధ్య చీలిక తెచ్చి భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చలో కరేడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలిన కోరారు. అనంతరం పోస్టర్ విడుదల చేశారు. సమావేశంలో నాయకులు రాంబాబు, చండ్ర రాజగోపాల్, దామా అంకయ్య, షాన్‌వాజ్, మాదాల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఎర్రచందనం కేసులో ఒకరికి ఏడాది జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న కేసులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం పంగిలి గ్రామానికి చెందిన కె.నరసింహులుకు ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శ్రీకాంత్ గురువారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్ ఆఫీసర్లు బాబు ప్రసాద్, రఘు, ఫారెస్ట్ అధికారి చక్రపాణి తెలిపిన వివరాల మేరకు.. 2014 మార్చి 5వ తేదీ నెల్లూరు డివిజన్, రాపూర్ ఫ్లైయింగ్ స్క్వాడ్ ఫారెస్ట్ సిబ్బంది సైదురాజులపల్లి రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో గూడ్స్ క్యారియర్ వాహనం ఫారెస్ట్ సిబ్బందిని చూసి వారికి దూరంగా ఆగింది. ఆ వాహనంలోని ముగ్గురు పరారయ్యారు. అయితే వారిలో నిందితుడు నరసింహులును మాత్రం ఫారెస్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 436 కిలోల 17 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నరసింహులును విచారించగా మరో ఇద్దరి పేర్లను తెలిపాడు. దీంతో ఫారెస్ట్ సిబ్బంది వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. నేరం నరసింహులుపై మాత్రం రుజువు కావడంతో న్యాయమూర్తి అతడికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మరో ఇద్దరిపై కేసును కొట్టేస్తూ తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీసీ నిర్మల వాదించారు.
నెల్లూరు జైలుకు తరలింపు
నెల్లూరు(అర్బన్): కోర్టు శిక్ష విధించిన నరసింహులును నెల్లూరు జైలుకు తరలిస్తున్నట్లు ఫారెస్ట్ రాపూరు రేంజర్ రవీంద్ర తెలిపారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించినా, రవాణాకు సహకరించినా కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు.