
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
● రూ.8 లక్షల ఆస్తి నష్టం
● లబోదిబోమంటున్న బాధితులు
కొడవలూరు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో రేకుల ఇల్లు దగ్ధమవడంతో ఓ కుటుంబం సర్వం కోల్పోయింది. ఈ ఘటన మండలంలోని గండవరం పూలతోట గాడికయ్యల్లో గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గోళ్ల ప్రసాద్, లక్ష్మి దంపతులు కూలీ పనులకు వెళ్తుంటారు. రోజూలాగే గురువారం ఉదయం పనికెళ్లారు. వారింట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. వస్తువులు పూర్తిగా తగులబడే వరకూ చుట్టుపక్కల వారు గుర్తించలేకపోయారు. కొంతసేపటి తర్వాత వాసన రావడం, కిటికీలో నుంచి పొగ వస్తుండటంతో గుర్తించి బాధితులకు సమాచారం అందించారు. వారు ఇంటికి చేరుకోగా అప్పటికే బీరువా, రిఫ్రిజిరేటర్, మంచం, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయింది. పనికెళ్లి పొదుపు చేసి బీరువాలో దాచిన రూ.3 లక్షల నగదు, రూ.3 లక్షల విలువైన బంగారు నగలు, రూ.2 లక్షల విలువైన సామగ్రి తగులబడిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. గ్రామానికి చెందిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వారిని పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం