
మహాసభల జయప్రదానికి పిలుపు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నెల్లూరు నగరంలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు జరిగే సీపీఐ జిల్లా మహాసభలు, 20 నుంచి 25వ తేదీ వరకు ఒంగోలులో నిర్వహించే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య పిలుపునిచ్చారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. కోటమిట్ట షాదీమంజిల్‌లో జిల్లా సభలు జరుగుతాయన్నారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సిరాజ్, మధు, షాన్‌వాజ్, మహిళా సంఘం నాయకురాలు శిరీషా, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తా
నెల్లూరు సిటీ: రూరల్ పరిధిలోని ధనలక్ష్మీపురం వద్ద డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తాపడి ఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కారు ముత్తుకూరు వైపు వేగంగా వెళ్తోంది. డ్రైవర్ దానిని అదుపు చేయలేకపోవడంతో డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. వాహనంలోని నలుగురు వ్యక్తులకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు వారిని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. కారు బోల్తా పడిన సమయంలో ఎదురు నుంచి వాహనాలు రాకపోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు అందలేదు.
చుండి మోడల్ స్కూల్ ఎంపిక
వలేటివారిపాలెం: ఉత్తమ పాఠశాలగా మండలంలోని చుండి మోడల్ స్కూల్ ఎంపికై నట్లు ప్రిన్సిపల్ పడమటి వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పది పాఠశాలలను ఎంపిక చేయగా అందులో చుండి స్కూల్ ఉందన్నారు. యాజమాన్యాల వారీగా పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత, అత్యధిక సరాసరి మార్కులు సాధించిన స్కూళ్లను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈనెల 15వ తేదీన విజయవాడలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం అవార్డు ప్రదానం చేస్తారన్నారు.
కండలేరులో 26.8 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 26.8 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 5,900 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,800, పిన్నేరు కాలువకు 20, లోలెవల్ కాలువకు 40, మొదటి బ్రాంచ్ కాలువకు 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

మహాసభల జయప్రదానికి పిలుపు

మహాసభల జయప్రదానికి పిలుపు