
హాస్పిటళ్లలో ఆకస్మిక తనిఖీలు
నెల్లూరు(అర్బన్): డీఎంహెచ్‌ఓ సుజాత ఆదేశాల మేరకు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిణి (డీఐఓ) ఉమామహేశ్వరి బుధవారం హాస్పిటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నెల్లూరులోని విజయానంద్ ఆర్థోపెడిక్ ఆస్పత్రి, సుమ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్, లక్ష్మి ఆర్థోకేర్ సెంటర్, ఆకర్ష్ హాస్పిటల్ తదితరాలకు వెళ్లారు. ఏపీ అల్లోపతి క్లినికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 2002 నిబంధనల ప్రకారం ఆస్పత్రి నిర్వహణ జరుగుతుందో? లేదా? పరిశీలించారు. రికార్డులు చూశారు. ఉమామహేశ్వరి మాట్లాడుతూ ఆస్పత్రుల్లో ధరల పట్టికను ప్రదర్శించాలన్నారు. స్కానింగ్ వివరాల నివేదికను ప్రతి నెలా వైద్యశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్లు లేకుండా ఎవరైనా వైద్యం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.