
రెవెన్యూ శాఖ వినతులే అధికం
నెల్లూరు రూరల్: ప్రతి వారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెవెన్యూ శాఖకు సంబంధించిన వినతులే అధికంగా వస్తున్నాయి. ఈ సోమవారం జేసీ కె.కార్తీక్ తదితరులు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మొత్తం 411 వినతులందాయి. రెవెన్యూ శాఖవి 141, పోలీస్ శాఖవి 62, మున్సిపల్ శాఖవి 40, సర్వేవి 30, పంచాయతీరాజ్ శాఖవి 38 తదితరాలున్నాయి. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు వినతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో హుస్సేన్ సాహెబ్, డ్వామా పీడీ గంగాభవాని, డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, డీఎంహెచ్‌ఓ సుజాత, హార్టికల్చ ర్ ఏడీ సుబ్బారెడ్డి, విద్యుత్ ఎస్‌ఈ విజయన్ తదితరులు పాల్గొన్నారు.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, పాస్టర్లపై దాడులు, అక్రమ కేసులను అరికట్టాలంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద నెల్లూరు క్రైస్తవ సమాఖ్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ డాక్టర్ ఎండీ ప్రకాశం మాట్లాడుతూ అనేక పోరాటాల తర్వాత సిక్కులకు, బౌద్ధులకు ఎస్సీ హోదా కల్పించి దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఇంత కాలమైనా నిరాకరించడం ప్రాథమిక హక్కులకు విరుద్ధమన్నారు. దళిత క్రైస్తవ మహాసభ అధ్యక్షుడు డాక్టర్ ఎలీషాకుమార్ కలివెల మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పాస్టర్లు, సిస్టర్లపై, చర్చిలపై దాడులను, అక్రమ కేసులు బనాయించడాన్ని అరికట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అనంతరం జేసీకి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో డేనియల్, బెనహర్ బాబు, డేవిడ్, దయాసాగర్, క్రాంతికుమార్, ప్రభుకుమార్, రాజశేఖర్, హృదయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
సూపర్‌సిక్స్ కోసం..
సూపర్‌సిక్స్ పథకాలను మంజూరు చేయాలని జిల్లా అంధుల సమాఖ్య అధ్యక్షుడు ఎస్‌కే జకావుల్లా, ఉపాధ్యక్షుడు దుర్గాబాబు, షేక్ మస్తాన్, ఎస్‌కే సనావుల్లా, ఎస్‌కే జిలానీ తదితరులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని నెల్లూరులో ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగులందరికీ ఇండిపెండెంట్ రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు. శాశ్వత ఉపాధి కల్పించాలన్నారు. గృహాలను ప్రభుత్వం నిర్మించాలన్నారు.
అక్రమ మైనింగ్‌పై చర్యలకు డిమాండ్
సైదాపురం, గూడూరుల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ నిర్వహించే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ సెక్రటరీ, అక్రమ మైనింగ్ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు ఎం.రాజేష్ కుమార్ వినతిపత్రం అందజేశారు. సైదాపురంలోని కేఎస్‌ఆర్, సిద్ధి వినాయక, షిర్డీ సాయి, శోభారాణి, వెంకటకనకదుర్గ, ఉమామహేశ్వర మైకా మైన్స్‌లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. అధికారులు తనిఖీలు చేసి నోటీసులిచ్చినా మాఫియా లెక్కచేయడం లేదన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నట్లు చెప్పారు. సమితి గౌరవాధ్యక్షుడు పి.శ్రీనివాసులురెడ్డి, ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ, శివకుమార్, పాల్‌రాజ్, షేక్ షఫీ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
411 వినతుల అందజేత

రెవెన్యూ శాఖ వినతులే అధికం

రెవెన్యూ శాఖ వినతులే అధికం