
35 బైక్‌లు, రెండు ఆటోల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నవాబుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోమవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నగర డీఎస్పీ పి.సింధుప్రియ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు బృందాలుగా ఏర్పడి బోడిగాడితోట, అహ్మద్‌నగర్, బర్మాషెల్‌గుంట నాలుగు వైపులా దిగ్భందించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. యజమానితోపాటు కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు. వాహనపత్రాలను పరిశీలించారు. పత్రాలు, నంబర్ ప్లేట్లు సక్రమంగా లేని 35 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకుని నవాబుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేరనియంత్రణ, అసాంఘిక కార్యక్రమాల కట్టడే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్‌లకు ప్రజలు సహకరించాలని డీఎస్పీ కోరారు. ప్రజలు తమవంతు బాధ్యతగా అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మత్తు పదార్థాల వినియోగంపై డయల్ 112, 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సెర్చ్‌లో నవాబుపేట ఇన్‌స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.