
కారు బోల్తా పడి..
● వృద్ధుడి మృతి, ముగ్గురికి గాయాలు
దగదర్తి: మండలంలోని సున్నపుబట్టి సమీపంలో అటవీ ప్రాంతం వద్ద హైవేపై సోమవారం కావలి వైపు వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు నుంచి తెనాలికి కారులో రత్నరాజు, అతని భార్య విజయకుమారి, కోడలు సుహాసిని, అల్లుడు వంశీ ప్రయాణిస్తున్నారు. వంశీ వాహనం నడుపుతున్నాడు. అటవీ ప్రాంతం వద్దకు రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది. రత్నరాజు (83) అక్కడికక్కడే మృతిచెందాడు. విజయకుమారి చేతికి తీవ్ర గాయమైంది. సుహాసిని, వంశీ స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైవే అంబులెన్సులో నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జంపాని కుమార్ తెలిపారు.