
విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి
● 40 రోజుల్లో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య
మామూళ్ల మత్తులో అధికారులు
కార్పొరేట్ విద్యా సంస్థల ధనదాహానికి విద్యార్థుల బలిదానాలు హృదయాలను కలచివేస్తున్నాయి. మార్కులు, ర్యాంక్‌ల పేరుతో సరస్వతీ పుత్రులను చిదిమేస్తున్నారు. బిడ్డల భవిష్యత్తే తమ జీవితాశయమని తల్లిదండ్రులు తినీతినక కడుపులు మాడ్చుకుని, రెక్కలు ముక్కలు చేసుకుని రూ.లక్షలు తెచ్చి కార్పొరేట్ చేతుల్లో పోస్తున్నారు. బిడ్డలను చదివించమని వదిలి పెడితే.. చావును చూపించి శవాలను తిరిగి పంపిస్తున్నారు. కన్నవారికి కడుపు కోత మిగుల్చుతున్నారు. వేళకు పిడికెడు నాణ్యమైన మెతుకులు కూడా పెట్టకుండా మానవత్వం మరిచి మారీచుడిల్లా వ్యవహరిస్తున్నారు. అనధికారికంగా పాఠశాలలు, కళాశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాల నుంచి అధికారులు మామూళ్లు దండుకుంటున్న విషయం జగద్వితమే. అనుమతుల్లేకుండా హాస్టళ్లు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు జరుగుతున్నప్పుడైనా స్పందించాల్సిన విద్యాశాఖ అధికారులు ఏ కోశాన దయ, మానవత్వం లేకుండా తమకేమి సంబంధం లేదంటూ తప్పుకుంటున్నారు.
నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఆర్‌ఎన్‌ఆర్ జూనియర్ కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్ నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాచపాళేనికి చెందిన హేమశ్రీ పదో తరగతిలో మంచి మార్కులు సాధించడంతో తమ కళాశాలలో చేర్పించమని ఆ విద్యార్థిని తల్లిదండ్రులపై ఒత్తిడి చేసి ఇంటర్‌లో ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో జాయిన్ చేసుకున్నారు. ఈ కళాశాల హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు. బాగా చదువుకునే విద్యార్థిని ఇంకా బాగా చదవాలంటూ ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక సెక్షన్ మార్చాలని యాజమాన్యానికి విన్నవించుకుంది. తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె సెక్షన్ మార్చాలని కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఒత్తిడిని తట్టుకోలేని హేమశ్రీ అనుమానాస్పద స్థితిలో ఆదివారం తనవు చాలిచింది. ఇలా యాజమాన్యాల నిర్వాహకం, ఒత్తిళ్లు తట్టుకోలేక జిల్లాలో కేవలం 40 రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
గడిచిన 40 రోజుల వ్యవధిలో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా జిల్లా ఇంటర్ బోర్డు, ఉన్నతాధికారుల్లో చలనం లేదు. కనీసం అటు వైపు వెళ్లి తనిఖీ చేసిన సందర్భాలు లేవు. కార్పొరేట్ కళాశాలల్లో వసతులు, విద్యార్థులపై ఒత్తిడి, నాసిరకం భోజనంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా, కార్పొరేట్ యాజమాన్యాల నుంచి రూ.లక్షల్లో మామూళ్లు తీసుకుంటున్న ఇంటర్ బోర్డు అధికారులు కళాశాలలు, హాస్టల్స్ వైపు కన్నెత్తి చూడటం లేదని మండి పడుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై కనీసం జిల్లా అధికారి నుంచి కూడా స్పందన రాకపోవడంతో విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్‌బోర్డు అధికారులు మామూళ్ల మత్తులో తూలుతుండగా మరో వైపు కార్పొరేట్ యాజమాన్యాలు ధన దాహంతో చెలరేగి పోతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ ఆనంద్ స్పందించి అనుమతి లేని హాస్టల్స్, కళాశాలలను తనిఖీ చేసి వాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు కళాశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
● జిల్లాలో 30కు పైగా
జూనియర్ కళాశాలల హాస్టల్స్
● ఒక్క దానికి కూడా అనుమతి లేదు
● రూ.లక్షల్లో ఫీజులు.. దారుణ వసతులు
● ర్యాంకుల పేరుతో తీవ్రస్థాయిలో ఒత్తిడి
● తట్టుకోలేక బలవన్మరణాలు
నెల్లూరు (టౌన్): జిల్లాలో ఉన్న 137 కార్పొరేట్, ప్రైవేట్ ఇంటర్ జూనియర్ కళాశాలల్లో సుమారు 40 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఆయా కళాశాలలకు సంబంధించి 30 వరకు అనధి కార హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్స్‌ల్లో 15 వేల మందికి పైగా విద్యార్థినీ, విద్యార్థులు ఉంటున్నారు. వీటిల్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణకు చెందిన 10 హాస్టళ్లు ఉన్నాయి. ఇంటర్‌లో అకడమిక్, హాస్టల్‌కు కలిపి కళాశాలను బట్టి రూ.60 వేల నుంచి రూ.2.70 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇవికాకుండా పరీక్ష ఫీజు, హాస్టల్ డిపాజిట్, ప్రాక్టికల్స్, గేమ్స్ తదితర పేర్లుతో మరో రూ.5 వేల నుంచి రూ.7 వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన మంత్రి నారాయణ తమకు చెందిన విద్యా సంస్థలు, హాస్టల్స్‌ల్లోనే నాసిరకమైన భోజనం, వసతుల లేమి, ఒత్తిడితో కూడిన చదువులు ఉండడంతో ఎంతో మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఆశలు సమాధి చేసి.. ప్రాణాలు తీసి..
పేదింటి తల్లిదండ్రుల నుంచి శ్రీమంతుల వరకు తమ బిడ్డల భవిష్యత్‌పై ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. పేదింటి కుటుంబాలు అయితే తమ స్థోమతకు సరిపోకపోయినా.. కూలినాలీ చేసి, ఒక పూట తిని, మరో పూట పస్తులుండి, అప్పులు చేసి మరీ బిడ్డలను కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నారు. ధనదాహంతో మునిగిపోయిన యాజమాన్యాలు విద్యార్థులపై మార్కులు, ర్యాంక్‌ల పేరుతో తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు పెంచుతున్నారు. కష్టమని చెప్పినా.. నిర్బంధంగా చదవాల్సిందే అంటూ పెంచుతున్న ఒత్తిడికి తట్టుకోలేక తనువులు చాలించే పరిస్థితిలోకి జారిపోతున్నారు. ఘటన జరిగిన తర్వాతైనా ఆయా తల్లిదండ్రులకు బాసటగా నిలుస్తారా అంటూ అదీ ఉండడం లేదు. బిడ్డ చనిపోతే.. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేర్పించాంటూ చేతులు దులుపుకుంటున్నారు. కనీసం సమాచారం చెప్పే దిక్కుకూడా లేకుండా తాళాలు వేసి వెళ్లిపోతున్నారు.
అనుమతి లేకుండానే నిర్వహణ
జిల్లాలో జూనియర్ కళాశాలల పేరిట నిర్వహిస్తున్న ఏ హాస్టల్‌కు ప్రభుత్వ అనుమతి లేదు. కొన్ని యాజమాన్యాలు ఒకే భవనంలో కళాశాల, హాస్టల్ నిర్వహిస్తుండగా, మరికొన్ని యాజమాన్యాలు కళాశాల ఒకచోట, హాస్టల్ మరొక చోట నిర్వహిస్తున్న పరిస్ధితి ఉంది. ఏ ఒక్క హాస్టల్‌కు ఫైర్ సర్టిఫికెట్ లేదు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ప్రాణాలు వదలాల్సిన భయానక పరిస్థితి ఉంది. హాస్టల్స్‌ల్లో వసతులు అధ్వానంగా ఉంటున్నాయి. కారాగారాలను తలపించే విధంగా భవనాలు, ఇరుకు గదుల్లో ఐదుగురు నుంచి ఏడుగురు విద్యార్థులను ఉంచుతున్నారు. హాస్టల్ పేరుతో రూ.లక్షలు గుంజుతున్నా నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ర్యాంకులు పేరుతో ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు తరగతులు, స్టడీ అవర్స్ పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. విద్యార్థులు చదవలేమని చెప్పినా ఆయా యాజమాన్యాలు బలవంతంగా వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. భోజనం బాగాలేదని, హాస్టల్స్‌ల్లో మరుగుదొడ్లు, ఇరుకు గదుల్లో మేం పడుకోలేకున్నామని తల్లిదండ్రులకు చెప్పినా ఏదో రకంగా సర్దుకుపోమ్మని సలహా ఇస్తున్నారు.
● బీసీ విద్యార్థి సంఘం
నెల్లూరు (అర్బన్) : నగరంలోని ఆర్‌ఎన్‌ఆర్ కళాశాల విద్యార్థిని హేమశ్రీ అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ చేపట్టడంతోపాటు అందుకు కారణమైన కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీసీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో జేసీ కార్తీక్‌కకు ఆ సంఘ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్, జిల్లా అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ మెంబర్ మురళీకృష్ణయాదవ్ మాట్లాడుతూ విద్యార్థిని అనుమానాస్పద మృతిపై పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఉదయం 8.30 గంటలకు తల్లిదండ్రులకు హేమశ్రీ ఫోన్ చేసి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, చదువుల్లో నన్ను ఇబ్బంది పెడుతున్నారంటూ ఫోన్ చేసిందన్నారు. ఆ తర్వాత అర్ధగంటలోపే విద్యార్థిని మృతి చెందడం వెనుక ఉన్న ఒత్తిడి, ఇబ్బందులపై విచారణ జరిపించాలన్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైన 3 నెలల్లోనే నెల్లూరులోని వివిధ కార్పొరేట్ కళాశాలల్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇందుకు కారణమైన వారిని శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు విజయ్, బాలాజీ, సుధీర్‌యాదవ్, నాయబ్‌లు పాల్గొన్నారు.
హాస్టల్స్‌ను పర్యవేక్షించే అఽధికారం లేదు
ఇంటర్ జూనియర్ కళాశాలలకు సంబంధించి నిర్వహిస్తున్న హాస్టల్స్‌ను పర్యవేక్షించే అధికారాలు మాకు లేవు. విద్యార్థిని ఆత్మహత్యపై ఆర్‌ఎన్‌ఆర్ జూనియర్ కళాశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశాం. ఆ కళాశాలకు తనిఖీకి వెళ్లితే తాళం వేసి ఉంది. విద్యార్థిని ఆత్మహత్యపై విచారించి కళాశాల యాజమాన్యమే కారణమని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అన్ని కళాశాలలను తనిఖీ చేస్తాం. అనుమతి లేని వాటిని సీజ్ చేసి చర్యలు చేపడతాం.
– వరప్రసాదరావు, ఆర్‌ఐఓ
యాజమాన్యాలపై కేసు నమోదు చేయాలి
రాష్ట్రంలో అనుమతి లేకుండా హాస్టల్స్‌ను నిర్వహిస్తున్న కళాశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వాటిని వెంటనే సీజ్ చేయాలి. విద్యార్థుల ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి కారణమైన కళాశాల గుర్తింపు రద్దు చేయాలి. కళాశాల, హాస్టల్స్ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేయాలి. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
– నరహరి, రాష్ట్ర అధ్యక్షుడు, పేరెంట్స్ అసోసియేషన్

విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి

విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి

విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి

విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి

విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి