
వాహనమిత్ర అమలు చేయాలి
నెల్లూరు రూరల్: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన వాహన మిత్ర పథకాన్ని లైసెన్సు కలిగిన ప్రతి డ్రైవర్‌కు అమలు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఆటోడ్రైవర్లకు గత ప్రభుత్వం కంటే మిన్నగా ఇస్తామని కూటమి పెద్దలు హామీలిచ్చారన్నారు. ప్రతి ఆటోడ్రైవర్‌కు రూ.25 వేలు ఇవ్వాలన్నారు. సోమవారం భారీగా తరలివచ్చిన ఆటోడ్రైవర్లు కలెక్టరేట్ ఎదుట కదం తొక్కారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఉపాధి కోల్పోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే జీఓ నంబరు 21 పేరుతో ట్యాక్స్‌లు, జరిమానాలు భారీగా పెంచడంతో ఆర్థికంగా తమపై భారం పడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం నెల్లూరు జిల్లా ఆటోకార్మిక సంఘం ఆధ్వర్యంలో వీఆర్ కాలేజీ గ్రౌండ్ నుంచి 500 మంది ఆటో డ్రైవర్లు కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి, ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు టీవీవీ ప్రసాద్, ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఓ సురేష్, రాజా మాట్లాడుతూ ఇప్పటికే ఆర్థిక భారాలతో సతమతమవుతున్న ఆటో కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఉచిత బస్సు నిర్ణయంతో జీవితాలు మరింత దుర్భరంగా మారే పరిస్థితి అనివార్యమవుతుందన్నారు. గత ప్రభుత్వం ఆటో కార్మికులకు ఏటా రూ.10 వేల వాహనమిత్ర పథకం ద్వారా సాయాన్ని అందించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండో సంవత్సరం గడుస్తున్నా.. ఆటోకార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చే విధానాన్ని ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వకుండా ఆపాలని ఆర్టీఏ అధికారుల ద్వారానే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కోరారు. పెనాల్టీలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు తగ్గించాలన్నారు. బ్యాంకు నుంచి వాహనాల కొనుగోలుకు రూ.4 లక్షల రుణాన్ని సబ్సిడీతో కూడిన వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలన్నారు. మండలాల్లో ఆటో పార్కింగ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు స్వర్ణా బాబురావు డి లవన్‌కుమార్, నున్న సురేష్ రాధయ్య, పెంచలయ్య, రవీంద్ర శ్యాంసన్, ఎం.సుధాకర్ విజయ్, హరి, దయాసాగర్, అశోక్, జిల్లా నలుమూలల నుంచి 500 మంది ఆటో కార్మికులు పాల్గొన్నారు.
మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఉపాధి కోల్పోతాం
జీఓ నంబర్ 21 పేరుతో పన్నులు,
జరిమానాల భారం
కలెక్టరేట్ ఎదుట కదం తొక్కిన
ఆటో డ్రైవర్లు