
కొంటే.. కూర‘గాయాలు’
నెల్లూరు (పొగతోట): జిల్లాకు కూరగాయలు సరఫరా చేసే ప్రధాన ఏసీ కూరగాయల మార్కెట్ అవినీతిమయమైంది. ఈ మార్కెట్లో అధికారులు అనేక పర్యాయాలు తనిఖీలు చేసినా, కేసులు పెట్టినా వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. అధికారులు తనిఖీ సమయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అధికారులు వెళ్లిన తర్వాత వ్యాపారుల తీరు షరా మామూలుగానే మారుతోంది. తూకాల్లో మోసాలు, కుళ్లిపోయిన, పుచ్చిపోయిన కూరగాయలను వినియోగదారులకు అంటగడుతున్నారు. వ్యాపారులు నిత్యం వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఈ తంతు నిత్యం జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
కేజీకి 850 గ్రాములే..
కేజీ కూరగాయలు తీసుకుని బయటకు వచ్చి తూకం వేస్తే 850 గ్రాములు మాత్రమే ఉంటున్నాయి. వినియోగదారులు తూకం వేసి పరిశీలించుకునేందుకు ధర్మకాటా ఏర్పాటు చేశారు. ధర్మకాటా బోర్డు మాత్రం కనిపిస్తోంది. కానీ కాటా కనిపించదు. నిత్యం వేలాది మంది వినియోగదారులు ఇక్కడ కూరగాయలు కొనుగోలు చేస్తూ మోసపోతున్నారు. ఈ విషయంపై అదికారులకు ఫిర్యాదులందినా నామమాత్రపు చర్యలతో సరిపెట్టుకుంటున్నారనే విమర్శలున్నాయి. గతంలో జిల్లాలో పనిచేసిన జాయింట్ కలెక్టర్ ఈ మార్కెట్‌పై నిఘా పెట్టి, తరచూ తనిఖీ చేయడంతో ఆయన ఉన్నంత కాలం వ్యాపారులు నిజాయితీగా వ్యవహరించారు. ఆయన వెళ్లిపోయాక కొత్తగా వచ్చిన ఏ అధికారి కూడా పట్టించుకోకపోవడంతో తిరిగి యథారాజా తథ ప్రజాగా మారారు.
ఒక పక్క మండిపోతున్న ధరలు
మరో వైపు తుకాల్లో మోసాలు
వ్యాపారులు సిండికేట్‌గా దోపిడీ
వినియోగదారుల జేబులకు చిల్లు
కుళ్లినవి, పుచ్చినవి అంటగడుతున్నారు
నెల్లూరుకు వచ్చిన సమయంలో ఇంటికి వెళ్లేటప్పుడు మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేస్తాం. వ్యాపారులు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. కుళ్లినవి, పుచ్చినవి అంటగడుతున్నారు. ఇవేమని ప్రశ్నిస్తే భలే కొన్నావ్‌లే పోవయ్యా అంటూ ఛీదరించుకుంటున్నారు. అధికారులు చొరవ తీసుకొని వినియోగదారులు నష్టపోకుండా చూడాలి.
– విజయేంద్రబాబు, పొదలకూరు
వ్యాపారులకు నోటీసులిస్తాం
వినియోగదారులు నష్టపోకుండా ప్రత్యేక దృష్టి సారిస్తాం. వినియోగదారులను నష్టపరుస్తున్న వ్యాపారులపై దృష్టి పెట్టి నోటీసులు అందించి కేసులు నమోదు చేస్తాం. నిత్యం ధర్మకాటా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం.
– అనితకుమారి, మార్కెటింగ్ ఏడీ