
చిత్రం సాక్షిగా దొరికిన ఖాకీలు
అక్రమ కేసుల్లో జిల్లా కేంద్ర కారాగార రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్, టీడీపీ కిరాయి ముష్కరుల దాడి ఘటన నేపథ్యంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు గత నెల 31వ తేదీన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరుకు వచ్చారు. అయితే జగన్ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున నిర్బంధ ఆంక్షలు విధించారు. అయితే ఆంక్షలను లెక్క చేయని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావడంతో కూటమి నేతలు జీర్ణించుకోలేకపోయారు. పోలీసులను ఉసిగొల్పడంతో ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ సమీపంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులపై అకారణంగా ఒక్కసారిగా లాఠీచార్జి చేశారు. దీంతో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితోపాటు పలువురికి గాయాలయ్యాయి. తనతోపాటు పార్టీ శ్రేణులపై లాఠీచార్జి చేయడాన్ని గర్హిస్తూ ప్రసన్నకుమార్‌రెడ్డి పోలీసుల చర్యలపై నిరసన వ్యక్తం చేస్తూ అక్కడే రోడ్డుపై బైఠాయించారు. లాఠీచార్జి జరుగుతున్న సమయంలో అక్కడున్న ఎస్‌బీ హెడ్‌కానిస్టేబుల్ మాలకొండయ్య ఫొటోలు తీసేందుకు వెనక్కి వెనక్కి వెళుతూ తనను తానే తట్టుకుని పడిపోతున్నట్లు ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. సదరు హెడ్‌కానిస్టేబుల్ కింద పడిపోవడానికి లాఠీచార్జి చేస్తున్న పోలీసుల దూకుడుతోనే జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ ఘటనకు కొంచెం దూరంలో పార్టీ శ్రేణులతో ప్రసన్నకుమార్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించిన దృశ్యం అదే చిత్రంలో కనిపిస్తోంది. హెడ్‌కానిస్టేబుల్ కింద పడుతున్నప్పుడు, పడిన తర్వాత ఆయనకు దగ్గరల్లో కేసులో పేర్కొన్న ఏ వ్యక్తి లేరని ఫొటోలు, వీడియోలతో తేలిపోయింది. దీనిని బట్టి చూస్తే కూటమి నేతలు ఓ పథకం ప్రకారం వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయించేందుకు హెడ్‌కానిస్టేబుల్‌ను ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు తెలిసినప్పటికీ కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమ కేసులు నమోదు చేశారని తెలుస్తోంది. పోలీసులు తమపై పెట్టిన అక్రమ కేసులపై వైఎస్సార్‌సీపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు రావడం వాస్తవాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. తాజా పరిణామాలతో పోలీసులు ఇరకాటంలో పడ్డారు. ఎలాగైనా తామే కరెక్ట్ అని నిరూపించుకునే పనిలో పడ్డారు.

చిత్రం సాక్షిగా దొరికిన ఖాకీలు