
అందుబాటులో 1100 కాల్ సెంటర్
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు రూరల్: పీజీఆర్‌ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి 1100 కాల్ సెంటర్ అందుబాటులో ఉందని కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోల్ ఫ్రీ నంబరు ప్రభుత్వ ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఒక భాగమని, ఇది పౌరులు లేవనెత్తిన సమస్యలను సంబంధిత విభాగాలకు పంపి సకాలంలో పరిష్కరించేలా చేస్తుందన్నారు. ప్రభుత్వ సేవలు, స్థాని క సమస్యలు ఇతర ప్రజాసమస్యలకు సంబంధించిన సమస్యలను నివేదించడానికి పౌరులు ఏ ఫోన్ నుంచి అయినా 1100కు ఉచితతంగా కాల్ చేయొచ్చు అన్నారు. ఫిర్యాదులను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో సౌలభ్యం కోసం నమోదు చేసుకోవచ్చునని, దీన్ని వినియోగించుకోవాలన్నారు.
పాఠశాల విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు
● డీఈఓ బాలాజీరావు
నెల్లూరు(అర్బన్): జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు సంబంధించి 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మొదటి నిర్మాణాత్మక మదింపు (ఎస్‌ఏఎంపీ–1) పరీక్షలు సోమవారం నుంచి జరుగుతాయని డీఈఓ బాలాజీ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు మూడు రోజుల పాటు, 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు నాలుగు రోజుల పాటు టైం టేబుల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయన్నారు. 11వ తేదీ ప్రథమ భాష తెలుగు, గణితం 12న ద్వితీయ భాష హిందీ, సామాన్యశాస్త్రం/భౌతికశాస్త్రం, 13న తృతీయ భాష ఆంగ్లం, సాంఘిక శాస్త్రం, 14న ప్రధాన భాష సంస్కృతం, జీవశాస్త్రం పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రతి సబ్జెక్ట్‌కు 35 మార్కులతో పాటు ప్రతి సబ్జెక్ట్‌లో తరగతి గది ప్రతిస్పందనలు, రాత పనులు, ప్రాజెక్ట్ పనులుకు ఒక్కొక్కటికి 5 మార్కులు చొప్పున ఉపాధ్యాయులు పరీక్షలు నిర్వహించి మొత్తం 50 మార్కులకు మదింపు చేస్తారని తెలిపారు. విద్యార్థులు పరీక్షలు రాసిన తర్వాత ఉపాధ్యాయులు జవాబులను మూల్యాంకనం చేసి ఆ మార్కులను మదింపు పుస్తకంలోని ఓఎంఆర్‌లో నమోదు చేసి, స్కాన్ చేసి లీప్ యాప్‌ద్వారా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించారు. పరీక్ష ఫలితాలను రాష్ట్ర స్థాయిలో మదింపు చేసి ప్రస్తుత విద్యాప్రమాణాల మీద, తదుపరి చర్యలపైన ఉపాధ్యాయులకు సూచనలు చేస్తారన్నారు.
శిలాఫలకం ధ్వంసం కేసులో ఇద్దరి అరెస్ట్
● కావలి డీఎస్పీ శ్రీధర్
కావలి (జలదంకి): తమ్మలపెంట పట్టపుపాళెంలో జల్‌జీవన్ మిషన్ శిలాఫలకం ధ్వంసం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు కావలి డీఎస్పీ కే శ్రీధర్ తెలిపారు. ఆదివారం కావలి డీఎస్పీ తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివవరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ తమ్మలపెంట పట్టపుపాళెంలో 2021లో ప్రభుత్వ పథకం జల్‌జీవన్ మిషన్, రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఇటీవల ధ్వంసం చేశారు. ఈ కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పామంజి యానాదయ్య, కోడూరు జకరయ్య ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి జేసీబీతో శిలాఫలకాన్ని ధ్వంసం చేసి ట్రాక్టర్ల ద్వారా శిథిలాలను బయటకు తరలించారని తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. మిగిలిన ఐదుగురిని అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ రాజేశ్వరరావు, ఎస్సై తిరుమలరెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.