
చేపల వేటకెళ్లి ఇద్దరు యువకుల మృతి
కావలి (జలదంకి): చేపల వేటకు వెళ్లి మత్స్యకార యువకులు ప్రమాదవశాత్తు సముద్రంలో పడి గల్లంతై ఇద్దరు మృతి చెందిన ఘటన కావలి మండలం తుమ్మలపెంట సముద్రతీరంలో ఆదివారం జరిగింది. ఈ ఘటనలో మరొక యువకుడిని మైరెన్ పోలీసులు కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు.. తుమ్మలపెంట పల్లెపాళెంకు చెందిన శ్రీహరి–వెంకటేశ్వరమ్మ కుమారుడు వెయ్యాల విష్ణు (20), శ్రీను–సావిత్రమ్మ కుమారుడు అయ్యాల శివకృష్ణ (19), మరో యువకుడు గొల్లపోతు నాగాచార్యులు కలిసి మొయ్యవల తీసుకుని సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. విష్ణు, శివకృష్ణ సుడిగుండంలో చిక్కుకుని గల్లంతయ్యారు. కొంత దూరంలో ఉన్న నాగాచార్య నీటిలో కొట్టుకుంటూ కేకలు వేశాడు. దీంతో మైరెన్ పోలీసులు స్పందించి స్థానిక మత్స్యకారులతో కలిసి బోటులో వెళ్లి నాగాచార్యను ఒడ్డుకు చేర్చారు. అప్పటికే నీట మునిగి అపస్మారక స్థితిలో ఉన్న విష్ణు, శివకృష్ణలను బోటులో ఒడ్డుకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే వారు మృతి చెందారు. అనంతరం ఇద్దరి యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. దీనిపై రూరల్ ఎస్సై తిరుమలరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరొకరిని సురక్షితంగా
ఒడ్డుకు చేర్చిన మైరెన్ పోలీసులు
తుమ్మలపెంట సముద్రతీరంలో ఘటన
పల్లెపాళెంలో విషాదఛాయలు

చేపల వేటకెళ్లి ఇద్దరు యువకుల మృతి