
ఆర్‌ఐఎంసీకి విద్యార్థి ఎంపిక
సంగం: మండలంలోని సిద్ధీపురం గ్రామానికి చెందిన డేగా చంద్రిల్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకమైన డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కళాశాల (ఆర్‌ఐఎంసీ)లో సీటు సాధించాడు. 8వ తరగతి ప్రవేశం కోసం గత సంవత్సరం డిసెంబర్‌లో ప్రవేశపరీక్ష జరిగింది. చంద్రిల్‌రెడ్డి ప్రతిభ చూపాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకునే అవకాశం ఉంది. అతను 6, 7 తరగతుల బుచ్చిరెడ్డిపాళెంలోని ఓ ప్రభుత్వ పాఠశాలు చదవడం విశేషం. తండ్రి డేగా మనోహర్‌రెడ్డి, తల్లి పవిత్ర తమ బిడ్డ సాధించిన విజయానికి సంతోషం వ్యక్తం చేశారు. ఎయిర్స్‌ఫోర్స్ అధికారి కావడమే తన లక్ష్యమని చంద్రిల్‌రెడ్డి చెబుతున్నాడు.
48 మద్యం బాటిళ్ల స్వాధీనం
దుత్తలూరు: దుత్తలూరు పంచాయతీ పరిధిలోని కమ్మవారిపాళెం మలుపు వద్ద అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్టుషాపుపై ఆదివారం దుత్తలూరు పోలీసులు దాడులు నిర్వహించారు. ఉన్నతాధికారుల సమాచారం మేరకు ఉదయగిరి సీఐ వెంకట్రావు, దుత్తలూరు ఎస్సై ఆదిలక్ష్మి తన సిబ్బందితో దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన 48 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైక్
● యువకుడికి గాయాలు
దగదర్తి: మండలంలోని ఉలవపాళ్ల హైవే సర్వీస్ రోడ్డుపై ఆర్టీసీ బస్సును వెనుక నుంచి మోటార్‌బైక్ ఢీకొనడంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. ఆదివారం కావలి నుంచి నెల్లూరు వైపు పల్లెవెలుగు బస్సు వెళ్తోంది. ఉలవపాళ్ల సర్వీసు రోడ్డు స్టాప్‌లో ప్రయాణికులు దిగారు. లోపల ఉండిపోయిన ఓ ప్రయాణికురాలు బస్సు ఆపాలని అడగడంతో డ్రైవర్ నిలిపాడు. అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ బైక్‌పై వెళుతూ ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి ఢీకొన్నాడు. అతడి కుడి కాలుకు తీవ్ర గాయమైంది. వెంటనే బంధువులు కావలి హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జంపాని కుమార్ తెలిపారు.
పోలీసుల అదుపులో జూదరులు
విడవలూరు: పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఘటన మండలంలోని ముదివర్తి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆదివారం మధ్యాహ్నం ముదివర్తి గ్రా మం పాత ఇసుక ర్యాంపు సమీపంలో వేపచెట్టు కింద కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో ఎస్సై పి.నరేష్ తన సిబ్బందితో వెళ్లి దాడులు చేశారు. అదే గ్రామానికి చెందిన ఎస్‌కే బాబు, షేక్ హనీఫ్, మారుబోయిన విష్ణుకుమార్, తంగం శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నారు. రూ.4 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలియజేశారు.
● మనుబోలు: మండలంలోని మనుబోలు దళితవాడలో పేకాట స్థావరంపై ఆదివారం ఎస్సై శివరాకేష్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. స్థానికులిచ్చిన సమాచారంతో దాడులు చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4,200 నగదు స్వాధీనం చేసుకున్నారు.
15 నుంచి రాపూరమ్మ జాతర
రాపూరు: మండల కేంద్రంలోని గ్రామదేవత రాపూరమ్మ జాతర ఈనెల 15వ తేదీ నుంచి జరుగుతుందని నిర్వాహకులు ఆదివారం తెలిపారు. ప్రాచీన కాలంనాటి ఈ ఆలయంలో 15న ఉదయం అభిషేకం, అంకురార్పణ, అమ్మవారి ఆహ్వానం, 16న పూలంగిసేవ, అన్నదానం, గంగపెట్టె ఊరేగింపు, 17న గ్రామ పొంగళ్లు, రాత్రి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కండలేరులో 25.917 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 25.917 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 5,280 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,700, పిన్నేరు కాలువకు 20, లోలెవల్ కాలువకు 40, మొదటి బ్రాంచ్ కాలువకు 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.