
కేసు నమోదు చేయాలంటూ..
● ఆర్‌ఎన్‌ఆర్ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా
● నేతలను తరిమికొట్టిన పోలీసులు
నెల్లూరు(అర్బన్): విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై పోలీసులు ఆర్‌ఎన్‌ఆర్ జూనియర్ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఆశ్రిత్‌రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్ర డిమాండ్ చేశారు. ఆదివారం ఆ కళాశాల వద్ద ఆయా సంఘాల నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆశ్రిత్‌రెడ్డి, నరేంద్ర మాట్లాడుతూ విద్యార్థిని ఆత్మహత్య ఉదయం జరిగినప్పుడు సాయంత్రం వరకు తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం చెప్పకపోవడం దారుణమన్నారు. ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపి కేసు నమోదు చేయాల్సి ఉందన్నారు. విద్యాశాఖాధికారులు కళాశాలకు వచ్చి పరిశీలించకపోవడం శోచనీయమన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి న్యాయం చేసేవిధంగా కలెక్టర్ స్పందించి కళాశాల గుర్తింపును రద్దు చేసి సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
న్యాయం అడిగితే..
విద్యార్థి నేతలు కళాశాల వద్ద ధర్నా నిర్వహించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అయినా కదలకపోవడంతో తరిమికొట్టారు. ఈ ఘటనలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను ఈడ్చి వేయడంతో చొక్కాలు చినిగిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతుంటే పోలీసులు కళాశాల యాజమాన్యానికి అనుకూలంగా తమపై దౌర్జన్యం చేయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి సంఘం నాయకులు తౌఫిక్, అబిద్, ఉస్మాన్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సరసింహ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు నాగేంద్ర, చైతన్య, జగదీష్, సుకుమార్, యశ్వంత్, సురేంద్ర, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

కేసు నమోదు చేయాలంటూ..

కేసు నమోదు చేయాలంటూ..