
సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చి..
● పాముకాటుకు గురై మహిళ మృతి
సంగం: ఓ మహిళ తమ్ముడికి రాఖీ కట్టి తన ఇంట్లోకి వెళ్లింది. అక్కడున్న నాగుపాము కాటుకు గురై చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన మండలంలోని అన్నారెడ్డిపాళెం పల్లిపాళెం గ్రామంలో జరిగింది. సంగం మండలం అన్నారెడ్డిపాళెం పల్లిపాళేనికి చెందిన పాకం రావమ్మ (50) కొన్ని సంవత్సరాలుగా బుచ్చిరెడ్డిపాళెంలో పనులు చేసుకుంటోంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం ఉదయం అన్నారెడ్డిపాళెం పల్లిపాళెంలో ఉంటున్న తన తమ్ముడు కనిసిరి హజరత్తయ్య వద్దకు వెళ్లి రాఖీ కట్టింది. పక్కనే ఉన్న తన ఇంటిని చూసేందుకు రావమ్మ వెళ్లింది. అప్పటికే అక్కడున్న నాగుపాము ఆమెను కాటు వేసింది. కేకలు వేయడంతో హజరత్తయ్య, గ్రామస్తులు బుచ్చిరెడ్డిపాళెంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రావమ్మ రాత్రి మృతిచెందింది. ఆదివారం ఉదయం పల్లిపాళెంలో అంత్యక్రియలు చేశారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆమె ఇంట్లోకి వెళ్లిన బంధువులకు కాటువేసిన నాగుపాము కనిపించడంతో కొట్టి చంపేశారు.