
80 శాతం బియ్యం బ్లాక్ మార్కెట్‌కే..
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ఆత్మకూరు నియోజకవర్గం డెల్టా, మెట్ట ప్రాంతంగా ఉంది. ఇక్కడి పేద ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యంలో 80 శాతానిపైగా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నట్లు సమాచారం. ఆత్మకూరు పట్టణంలోని పలు రేషన్ దుకాణాదారుల నుంచి కేజీ రూ.10 కొనుగోలు చేసి ఏజెంట్లకు రూ.15 చొప్పున విక్రయిస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని టెంకాయతోపు రహస్య ప్రాంతంలో స్టాక్ చేసి రాత్రి వేళల్లో మినీ వ్యాన్ల ద్వారా కావలి, నెల్లూరు, తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనంతసాగరం మండలంలో వెంగంపల్లి, చిలకలమర్రి గ్రామాల్లో సేకరించిన రేషన్ బియ్యాన్ని స్టాక్ ఉంచి వారం రోజులకొకసారి నెల్లూరు శివార్లలోని రైస్‌మిల్లులకు తరలిస్తుంటారు. రెండు రోజుల క్రితం అనంతసాగరం మండలం నుంచి తరలించిన 9.5 టన్నుల రేషన్ బియ్యాన్ని కోవూరు సమీపంలో పట్టుకున్న విషయం తెలిసిందే. రేషన్ బియ్యం పంపిణీ మొదలు పెట్టిన వారం రోజులకే (7వ తేదీ నాటికే) ఒక అనంతసాగరం మండలం నుంచే తొమ్మిదిన్నర టన్నుల రేషన్ సేకరించారంటే మిగిలిన మండలాల్లో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. మంత్రి ఆనం ప్రాతినిథ్యం వహించే అనంతసాగరం మండలంలో బుట్టి మహేష్‌రెడ్డి అనే వ్యక్తి ప్రధాన సూత్రదారుడిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఆయన ఆధ్వర్యంలో కృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, సుబ్బారెడ్డి, వేముల రెడ్డి ఈ బియ్యాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరో బ్యాచ్‌కు చెందిన నలుగురు వ్యక్తులు కొత్తగా రేషన్ బియ్యాన్ని సేకరించే పని మొదలు పెట్టారని సమాచారం. గతంలోనూ వెంగంపల్లి కేంద్రంగా టీడీపీ నాయకులు రేషన్ బియ్యం దందా కొనసాగిస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే.