
అవినీతి మత్తు.. గ్రావెల్ ఎత్తు
ఉదయగిరి: నియోజకవర్గంలో పలు మండలాల్లో మట్టి, గ్రావెల్ మాఫియాలు బరి తెగిస్తున్నాయి. చెరువులు, శ్మశానాలు, ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గ్రావెల్, మట్టి తవ్వేసి జేబులు నింపుకుంటున్నా రు. వ్యవసాయ భూములు చదును, లేఅవుట్లు, ఇతర అవసరాల కోసం జరుగుతున్న దోపిడీలో అధికారు లు మామూళ్లు మత్తులో జోగుతూ అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. వింజమూరులోని మల్లపరాజు వాగు చెరువు, పాతూరు, యర్రబల్లిపాళెం చెరువుల్లో రేయింబవళ్లు విచ్చలవిడిగా మట్టి తరలిస్తున్నారు. ఈ మూడు చెరువుల్లో సుమారు 50 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమార్కులు తరలించినట్లు అంచనా. అదే అనుమతులు తీసుకుని ఉంటే.. ప్రభుత్వానికి సుమారుగా రూ.2.25 కోట్లు రాబడి వచ్చేదని అధికారులు చెబుతున్నారు. వరికుంటపాడు మండలం జడదేవి, తూర్పు బోయమడుగు ల, విరువూరు, టి.కొండారెడ్డిపల్లి, జి.కొండారెడ్డి పల్లి తదితర గ్రామాల్లో అక్రమంగా గ్రావెవెల్ రవాణా సాగుతోంది. దుత్తలూరు మండలం తెడ్డుపాడు, దుత్తలూరు, నందిపాడు, నర్రవాడ పంచాయతీల్లో మట్టి, గ్రావెల్ అక్రమ దందాకు అంతూపంతూ లేదు. కలిగిరి, జలదంకి, కొండాపురం మండలాల్లో అయితే ప్రభుత్వ భూముల నుంచి మట్టి తరలింపు జరుగుతోంది. పెద్ద ఎత్తున మట్టి, గ్రావెల్ తరలిస్తున్నా రెవె న్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారులు తగిన చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.