కావలి (జలదంకి): కావలి నియోజకవర్గంలో కేజీఎఫ్ తరహాలో గ్రావెల్ దందా జరుగుతోంది. గ్రావెల్ మాఫియాకు కాసులు కురిపిస్తుంది. మండలంలోని ఇప్పటికే కావలి పెద్ద చెరువు, కొత్తపల్లి, రాజువారిచింతలపాళెం, రుద్రకోట, బుడమగుంట, ముసునూరు, గౌరవరం చెరువుల్లో గ్రావెల్ కొల్లగొట్టిన ఘనులు తాజాగా తాళ్లపాళెం, ఆముదాలదిన్నె చెరువుల్లో రేయింబవళ్లు గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నారు.
ఇక బోగోలు మండలంలో ముంగమూరు, కొండబిట్రగుంట, పాతబిట్రగుంట, కడనూతల, కోవూరుపల్లి, బోగోలు, కప్పరాళ్లతిప్ప తదితర ప్రాంతాల్లో నాణ్యమైన గ్రావెల్‌ను తవ్వేస్తున్నారు. అల్లూరు మండలం నార్తుఅములూరులో గ్రావెల్ దందా ఓ రేంజ్‌లో సాగుతోంది. రోజుకు వంద టిప్పర్లకు పైగా గ్రావెల్ అక్రమ రవాణా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే టీడీపీ నేతలు రాత్రి, పగలు తేడా లేకుండానే గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం టిప్పర్ రూ.10 వేల వరకు పలుకుతోంది. ఈ లెక్కన నిత్యం రూ.2 కోట్ల వరకు గ్రావెల్ వ్యాపారం జరుగుతోంది.
మమ్మల్ని అడిగేదెవరు, మమ్మల్ని అడ్డుకునేదెవరు అంటూ అక్రమ గ్రావెల్ దందా కొనసాగిస్తూ లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. తాజాగా తాళ్లపాళెం, ఆముదాలదిన్నె చెరువుల్లో కొద్ది రోజులుగా మూడు జేసీబీలు పెట్టి 50 నుంచి 60 ట్రాక్టర్లతో రేయింబవళ్లు గ్రావెల్‌ను అక్రమంగా లేఅవుట్లకు తరలిస్తూ దోచుకుంటున్నారు. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులు సైతం మాట్లాడేందుకు భయపడుతున్నారు.

కేజీఎఫ్ తరహాలో గ్రావెల్ దందా