
గ్రావెల్, మట్టి దోపిడీ.. పట్టించుకునే నాథుడేడీ?
ఆత్మకూరు: నియోజకవర్గంలో చెరువులు, కొండలు, తిప్ప ప్రాంతాల్లో గ్రావెల్‌ను తమ్ముళ్లు విచ్చలవిడిగా తవ్తేస్తున్నారు. పెద్ద ఎత్తున్న గ్రావెల్, మట్టి దోపిడీ జరుగుతున్నా.. పట్టించుకొనే నాథుడేడి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆత్మకూరు మేజర్ చెరువు, ముస్తాపురం చెరువుల నుంచి మట్టిని నిత్యం సుమారు 10 టిప్పర్లల్లో యథేచ్ఛగా లేఅవుట్లకు తరలిస్తున్నారు. చేజర్ల మండలం టీకేపాడు ఎర్రకుంట (చిన్న చెరువు) నుంచి కాకివాయికి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించారు. ఏఎస్‌పేట మండలం కొండమీదకొండూరు తిప్ప ప్రాంతం నుంచి గ్రావెల్‌ను ఆత్మకూరు, ఏఎస్‌పేట మండలాల్లో ఏర్పాటు చేస్తున్న వెంచర్లకు తరలిస్తూ దోచుకుంటున్నారు. ఏఎస్‌పేట మండలం హసనాపురం చెరువు నుంచి క్యూబిక్ మీటర్ల కొద్దీ మట్టిని తరలించడంతో లోతైన గుంతలు ఏర్పడ్డాయి. అనంతసాగరం మండలం వెంకటరెడ్డిపల్లి, మంచాలపల్లి చెరువులతోపాటు అటవీ ప్రాంతం నుంచి అనంతసాగరం, సోమశిల సమీపంలోని హైవేలో వెంచర్లకు తరలిస్తున్నారు.