
‘కనుపూరు చెరువు మట్టి’ కేసులో కాకాణికి బెయిల్
నెల్లూరు (లీగల్): కనుపూరు చెరువు నుంచి మట్టిని అక్రమంగా తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు వెంకటాచలం పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ నెల్లూరు 4వ అదనపు అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి నిషాద్ నాజ్ షేక్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొక్కరు రూ.25 వేలు ఆస్తి విలువ కలిగిన ఇద్దరు జామీన్‌దారుల పూచీకత్తు, రూ.25,000 వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల విచారణకు కాకాణి సహకరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి పి.ఉమామహేశ్వర్‌రెడ్డి, ఎంవీ విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో కాకాణిపై ప్రాథమిక ఆధారాల్లేవని, కేవలం రాజకీయ కక్షతో మొదటి నిందితుడిగా కేసు బనాయించారని వాదనలు వినిపించగా, వెంకటాచలం పోలీసులు తరఫున పీపీ మాల్యాద్రి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కాకాణికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.