స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో క్రీడా పోటీలు | - | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో క్రీడా పోటీలు

Aug 8 2025 9:05 AM | Updated on Aug 8 2025 9:05 AM

స్పోర

స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో క్రీడా పోటీలు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి క్రీడా పోటీలు, జట్ల ఎంపికలను గురువారం ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ప్రారంభించినట్లు క్రీడాభివృద్ధి అధికారి ఆర్కే ఎతిరాజ్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ తొలిరోజు అథ్లెటిక్స్‌, ఆర్చరీ, వెయిట్‌ లిఫ్టింగ్‌, బాక్సింగ్‌, కబడ్డీ క్రీడాంశాల్లో అండర్‌ – 22 విభాగంలో పోటీలు, ఎంపికలు చేపట్టామన్నారు. జిల్లా నలుమూలల నుంచి 275 మంది క్రీడాకారులు హాజరయ్యారన్నారు. ఈ ఎంపికల్లో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి ఖోఖో, బాస్కెట్‌బాల్‌, హాకీ, వాలీబాల్‌ క్రీడాంశాల్లో పోటీలు,ఎంపికలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

విద్యార్థులకు

ఇబ్బందుల్లేకుండా చూడండి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): బీసీ వసతి గృహంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా విజిలెన్స్‌ కమిటీ సభ్యులు మురళీకృష్ణ యాదవ్‌, యేసోబు శ్రీనివాసులు కోరారు. కోడూరులోని అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో ఆహారం కల్తీ జరిగి విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకుని గురువారం ప్రిన్సిపల్‌, విద్యార్థినులతో చర్చించారు. అనంతరం భోజనశాలకు వెళ్లి పరిశీలించారు. గురుకుల పాఠశాలలో విద్యుత్‌ సమస్యపై స్థానిక ఏఈతో మాట్లాడారు.

దాడిని ఖండిస్తున్నాం

పులివెందులలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌పై రౌడీమూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మురళీకృష్ణ యాదవ్‌ తెలిపారు.

పిడుగుపాటుకు గేదె, ఆవుల మృత్యువాత

వింజమూరు(ఉదయగిరి): మండలంలోని రెండు గ్రామాల్లో రైతులకు చెందిన ఒక గేదె, రెండు ఆవులు గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతిచెందాయి. స్థానికుల కథనం మేరకు.. తక్కెళ్లపాడులో కాకి కన్నయ్య సుమారు రూ.80 వేల విలువైన తన గేదెను ఇంటిముందు కట్టేశాడు. పిడుగుపడి గేదె మృతిచెందింది. జువ్విగుంటపాళెంలో వీరబ్రహ్మేంద్ర ఆశ్రమంలో ఉన్న రెండు ఆవులు పిడుగుపాటుకు గురై చనిపోయాయి. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు. కాగా ఉదయగిరి మండలం ఆర్లపడియలో పిడుగుపాటుకు నాలుగు మేకలు మృతిచెందాయి. గ్రామానికి చెందిన ఆశీర్వాదం అటవీ ప్రాంతంలో మేకలు మేపుకొంటుండగా ఒక్కసారిగా పిడుగుపడడంతో జీవాలు మృతి చెందాయి. మరో రెండు మేకల పరిస్థితి విషమంగా ఉంది.

బకాయిల విడుదలకు డిమాండ్‌

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): చేనేత రంగానికి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పముజుల హరి డిమాండ్‌ చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత కార్మికుల ఆత్మహత్యలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రూ.127.87 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. సహకార సంఘాలకు ట్రిఫ్ట్‌ ఫండ్‌ కింద రావాల్సిన రూ.17 కోట్లకు బదులుగా రూ.5 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, చేనేత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శేషయ్య, నేతలు వెంకటసురేష్‌, పముజుల చంద్రశేఖర్‌రావు, బైనా రాజశేఖర్‌ పాల్గొన్నారు.

యువతిపై

లైంగికదాడికి యత్నం

ఇందుకూరుపేట: మతిస్థిమితం లేని యువతిపై ఓ కామాంధుడు లైంగికదాడికి యత్నించాడు. ఈ ఘటన మండంలోని కొత్తూరు మజరా మేనాటిపాళెంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఇందుకూరుపేటకు చెందిన మైనంపాటి శీనయ్య కల్లు తాగేందుకు మేనాటిపాళెం వెళ్లాడు. అక్కడ ఓ యువతి ఒంటరిగా తిరుగుతుండగా బలాత్కరం చేయబోయాడు. ఇంతలో ఆమె తల్లి చూడటంతో శీనయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగార్జునరెడ్డి తెలిపారు.

స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో  క్రీడా పోటీలు1
1/2

స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో క్రీడా పోటీలు

స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో  క్రీడా పోటీలు2
2/2

స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో క్రీడా పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement