
2024 – 25 ఏడాదికి బోర్డు అనుమతి
కందుకూరు: పొగాకు రైతులను ఆదుకునే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కేవలం మాటలు, ఉత్తుత్తి ప్రకటనలకే పరిమితమైంది. రెండు నెలలుగా కొనుగోళ్లపై ఆడుతున్న నాటకాలే ఇందుకు నిదర్శనం. పొగాకు బోర్డు ప్రకాశం రీజియన్ పరిధిలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 11 వేలం కేంద్రాలున్నాయి. వీటిలో జిల్లాలో కందుకూరు–1, 2, కలిగిరి, డీసీపల్లిలో ఉన్నాయి. 11 కేంద్రాల పరిధిలో 2024 – 25 ఏడాదికి 105.27 మిలియన్ కేజీలను అమ్ముకునేందుకు బోర్డు అనుమతిచ్చింది. మార్చి 10, 19వ తేదీల్లో రెండు దశల్లో అన్ని కేంద్రాల్లో వేలం ప్రక్రియ ప్రారంభమైంది.
వేలం ప్రారంభమయ్యాక..
రైతులకు మద్దతు ధర కరువైంది. కేవలం బ్రైట్ గ్రేడ్‌కు మాత్రమే కేజీకి రూ.280 ఇచ్చిన వ్యాపారులు, మిగిలిన వాటిపై ధరల్ని దారుణంగా తగ్గించారు. ఇప్పటి వరకు వచ్చిన సరాసరి ధర చూస్తే కేజీకి కేవలం రూ.241 మాత్రమే. మద్దతు ధర కోసం అన్నదాతలు రెండు నెలలుగా పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. వేలం ప్రక్రియను అడ్డుకోవడంతోపాటు, రోడ్లపైకి వచ్చి పొగాకు తగులబెట్టి తమ నిరసనను తెలుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీశారు. మద్దతు ధరలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దిగొచ్చిన ప్రభుత్వం వేలంలో పోటీని పెంచేందుకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించుతున్నట్లు ప్రకటన చేసింది. కానీ నేటికీ ఏ కేంద్రంలోనూ మార్క్‌ఫెడ్ వేలం ప్రక్రియలో పాల్గొనలేదు.
నాడు.. నేడిలా..
గతంలో ఒకసారి పొగాకు మార్కెట్‌లో ధరల సంక్షోభం ఏర్పడినప్పుడు అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి కొనుగోలు చేయించారు. దీంతో వ్యాపారుల మధ్య పోటీ నెలకొని ధరలు పెరిగే పరిస్థితి వచ్చింది. నేటి కూటమి ప్రభుత్వం మాత్రం గత రెండు నెలలుగా కేవలం ఉత్తుత్తి ప్రకటనలకే పరిమితమైంది అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవానికి తూర్పువీరాయపాళెం వచ్చిన సీఎం చంద్రబాబు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.273 కోట్లతో 20 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటన చేయడం గమనార్హం. ఇప్పటికే మార్క్‌ఫెడ్ వేలం ప్రక్రియలో పాల్గొని రైతులను ఆదుకునే సూచనలు కనిపించడం లేదు. ఈలోగా వేలం ప్రక్రియ దాదాపు పూర్తికావడం ఖాయం. అంటే రైతులను పొగాకు రైతులను ఆదుకునే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోంది.
105.25
మిలియన్ కేజీలు
ఉత్పత్తి అంచనా