
చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం
● డీఆర్వో హుస్సేన్ సాహెబ్
నెల్లూరు(అర్బన్): చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ అధిక ప్రాధాన్యమిస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి హుస్సేన్ సాహెబ్ అన్నారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చేనేత వస్త్రాల స్టాల్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో డీఆర్వో మాట్లాడుతూ పాశ్చాత్య మోజులో పడి చేనేత రంగాన్ని మరిచిపోకూడదన్నారు. దేశంలో ఈ రంగానికి గుర్తింపు, ప్రత్యేక స్థానం ఉన్నట్లు చెప్పారు. మనదేశంలో తయారు చేసిన నేత వస్త్రాలు వివిధ దేశాల్లో ఖ్యాతిని గడించాయన్నారు. కార్మికులను గౌరవించుకోవడం, చేనేత కళను బతికించుకోవడం కోసం వారానికి ఒక రోజైనా ప్రజలు నేత వస్త్రాలను ధరించాలని కోరారు. అనంతరం పలువురు కార్మికులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడీ శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖాధికారి మారుతి ప్రసాద్, ఎల్‌డీఎం మణిశేఖర్, డీసీఓ గుర్రప్ప, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ సుధాకర్, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి
నెల్లూరు(క్రైమ్): నగరంలో నేరాల నియంత్రణ చర్యల్లో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసు అధికారులు దృష్టి సారించారు. నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎవరెవరు నివాసం ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? తదితర వివరాలను సేకరిస్తున్నారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలపై నిఘా పెంచారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. గురువారం రాత్రి నెల్లూరు నగరంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు అధికారులు పర్యటించి స్థానికులతో మాట్లాడారు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అసాంఘిక కార్యకలాపాలు, మత్తు, మాదక ద్రవ్యాల విక్రయాలు, రౌడీషీటర్లు, ఈవ్‌టీజర్ల వేధింపులను గుర్తిస్తే వెంటనే సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని సూచించారు. నేర నియంత్రణకు తాము తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నగర ఇన్‌స్పెక్టర్లు సీహెచ్ కోటేశ్వరరావు, జి.వేణుగోపాల్‌రెడ్డి, జి.దశరథరామారావు, కె.రోశయ్య, కె.శ్రీనివాసరావు, కె.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం