
మహిళపై దాష్టీకం
సోమశిల: కూటమి ప్రభుత్వంలో మహిళలపై దాడులు, హత్యాయత్నాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు నిందితులకు సహకరిస్తూ బాధితులపైనే కేసులు బనాయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. చేజర్ల మండలంలోని మడపల్లి గ్రామానికి చెందిన దళిత మహిళపై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలు, స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వసంతమ్మకు వివాహమై పిల్లలున్నారు. భర్త మృతిచెందగా బిడ్డలను పోషించుకునేందుకు ప్రభుత్వ భూమిని సాగు చేస్తోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, అతని బంధువులు సదరు భూమిని లాక్కునేందుకు కొన్నిరోజులుగా ప్రయత్నిస్తున్నారు. చంపేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని వసంతమ్మ ఆరోపించారు. పలుమార్లు రెవెన్యూ అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా సమాధానం చెప్పకుండా తమపైనే కేసులు బనాయిస్తామన్నారు. అసలు ప్రభుత్వ భూములు మీరెందుకు సాగు చేస్తున్నారని చేజర్ల తహసీల్దార్ మురళి అన్నారని ఆమె తెలిపారు. వసంతమ్మ పొలంలో కూరగాయల సాగు చేస్తుండగా బుధవారం సుబ్బారెడ్డి ట్రాక్టర్‌తో దున్నేందుకు వెళ్లాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వసంతమ్మను నానా రకాలుగా మాట్లాడి విచక్షణారహితంగా దాడికి పాల్పడటంతో గాయపడింది. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోరని బాధితురాలు తీవ్ర మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను బాధిత కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి కుమార్తె గురువారం మాట్లాడుతూ సుబ్బారెడ్డిని అడిగితే.. నేనేమైనా చేస్తా.. మీరు తక్కువ కులానికి చెందినవారు.. నేను తలుచుకుంటే మీ బట్టలు కూడా లేకుండా చేస్తామని బెదిరించాడని వాపోయింది. ఎస్సై, తహసీల్దార్ అతడికి సహకరిస్తూ మా మీదకి దాడిచేసేందుకు వస్తున్నారంటూ ఆవేదన చెందారు. అమ్మ చనిపోతే మాకు దిక్కెవరని, న్యాయం జరిగేలా చూడాలని రోదిస్తూ తెలియజేశారు.
దాడి చేయడంతో ఆత్మహత్యాయత్నం
నిందితులకు పోలీస్, రెవెన్యూ
అధికారుల సహకారం
బాధిత కుటుంబం ఆరోపణ