
18 నుంచి వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు
● ఏర్పాట్లపై ఆర్డీఓ సమీక్ష
వెంకటాచలం: మండలంలోని గొలగమూడిలో భగవాన్ వెంకయ్యస్వామి 43వ ఆరాధనోత్సవాలు ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు జరుగుతాయని నెల్లూరు ఆర్డీఓ అనూష తెలిపారు. గొలగమూడిలోని ఆశ్రమ పరిపాలనా కార్యాలయంలో ఆర్డీఓ గురువారం అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భక్తులు పెద్ద ఎత్తున రానున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. నెల్లూరు ఆర్టీసీ, ఆత్మకూరు బస్టాండ్ల నుంచి గొలగమూడి గ్రామం వరకు ప్రత్యేక బస్సులు నడపాలని చెప్పారు. పారిశుధ్యంపై పంచాయతీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల దర్శన సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లు పెట్టాలన్నారు. ముఖ్యంగా రథోత్సవం, తెప్పోత్సవం రోజున పోలీస్, విద్యుత్, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అత్యవసర మందులతోపాటు అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు సూచించారు. సమావేశంలో ఆశ్రమ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం, నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.