
సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలు
నెల్లూరు(అర్బన్): నల్సా వీర్ పరివార్ సహాయత యోజన పథకంలో భాగంగా గురువారం నెల్లూరులోని జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్‌ను జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాలతో ఇక్కడ సేవా క్లినిక్‌ను ప్రారంభించామన్నారు. ఇక్కడ ప్యానెల్ లాయర్, పారా లీగల్ వలంటీర్‌ను నియమించడం జరుగుతుందన్నారు. వీరు వారంలో ఒకరోజు సైనిక సంక్షేమ భవనంలో అందుబాటులో ఉంటారని తెలిపారు. సైనికులు, మాజీ సైనికులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. టోల్ ఫ్రీ నంబర్ 15100కి కూడా ఫోన్ చేసి తమ సమస్యలు వివరించవచ్చన్నారు. అనంతరం సైనిక సంక్షేమాధికారి, మాజీ సైనికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమాధికారి హరికృష్ణ, మాజీ వింగ్ కమాండర్ శ్యామ్‌ప్రసాద్, అసోసియేషన్ నాయకులు కళాధర్, రత్నయ్య పాల్గొన్నారు.