
కొవ్వొత్తులతో న్యాయవాదుల ప్రదర్శన
నెల్లూరు (లీగల్): కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై పాకిస్తాన్ ముష్కరులు సాగించిన ఉన్మాద కాల్పుల్లో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఉగ్ర చర్యలను నిరసిస్తూ నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణ నుంచి కొవ్వొత్తులతో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి సుందరయ్యయాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో బార్ అసోసియేషన్, జాయింట్ సెక్రటరీ పీవీ వరప్రసాద్, కోశాధికారి దన్పాల్ రమేష్, వీ శ్రీనివాసరావు, అయ్యప్పరెడ్డి, నక్క నాగరాజు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.