
VSS DOPIDI
పేరుకే వన సంరక్షణ సమితులు
పెత్తనం అంతా అధికారిదే
మొక్కల పెంపకంలో వేళ్లూనుకున్న అవినీతి
రూ.లక్షల్లో నిధుల స్వాహా యత్నం
విరువూరు, కనియంపాడు వీఎస్‌ఎస్‌ల్లో ఇదీ తంతు
అడవిలో జరిగే అవినీతి కదా ఎవరికి తెలుస్తుందిలే అనే ధీమా కావచ్చు. తెలిసినా ఏముందిలే... తాము తిన్న సొమ్ములో కొంత పడేస్తే నోరు ఎత్తరులే అనే ధైర్యం కావచ్చు... వన సంరక్షణ పేరుతో మొక్కల పెంపకంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతోంది. చేతికి మట్టి అంటకుండా ఓ అధికారే ఈ తంతుకు పాల్పడుతున్నారు.
ఉదయగిరి/వరికుంటపాడు: కేంద్ర ప్రభుత్వం అటవీ విస్తీర్ణం పెంచే యోచనలో భాగంగా సామాజిక వనాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తోంది. ఈ నిధులు ఉపయోగించి ప్రభుత్వ బంజరు భూముల్లో వనసంరక్షణ సమితుల ఆధ్వర్యంలో మొక్కలు నాటి.. వాటి సంరక్షణతో పాటు దానిపై వచ్చే ఆదాయం కూడా వీఎస్‌ఎస్ కమిటీలే తీసుకుంటాయి. పర్యవేక్షణ మాత్రం అటవీ అధికారులు చేస్తారు. కొంతమంది అధికారులు ఇదే తమకు అనుకూలంగా మార్చుకొని వీఎస్‌ఎస్ కమిటీలను డమ్మీలుగా మార్చి పనులు అన్నీ వారే చేసుకొని అవినీతికి పాల్పడుతున్నారు. ఉదయగిరి రేంజ్ స్థాయిలో ఓ అధికారి, జిల్లా స్థాయి ఉన్నతాధికారిని మేనేజ్ చేసి నిధులు దిగమింగుతున్నారు. ఈ తంతు వరికుంటపాడు అటవీ బీట్ ఏరియాలోని కొత్తపేట, కనియంపాడు, విరువూరుల్లో మొక్కల పెంపకం(ప్లాంటేషన్)లో సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వరికుంటపాడు, దుత్తలూరు మండలాల సరిహద్దు ప్రాంతం కొత్తపేట ఏరియాలో 116 హెక్టార్ల ప్రభుత్వ భూముల్లో ప్రత్యామ్నాయ వనీకరణ పథకానికి సుమారు రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో మొక్కలు నాటే కార్యక్రమం ఉదయగిరి అటవీ అధికారులు ప్రారంభించారు. ఈ పనులు కనియంపాడు వన సంరక్షణ సమితి కమిటీ సభ్యుల ఆఽధ్వర్యంలో జరగాలి. కానీ వారిని డమ్మీ చేసి పనులు మొత్తం అధికారులే చేసుకుంటూ కమిటీలకు మొండిచేయి చూపిస్తున్నారు. ఈ కమిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లను తమకు అనుకూలంగా మార్చుకొని వారి ఖాతాల నుంచి నగదు తీసుకుంటున్నారు. అధికారులు తెలివిగా తమకు ఏమీ సంబంధం లేనట్లు, అంతా వీఎస్‌ఎస్‌ల ద్వారా జరిగినట్లు భ్రమింపజేస్తున్నారు. పైకి పారదర్శకంగా కనిపిస్తున్నా లోగుట్టు వేరే విధంగా ఉంటోంది.
ఇష్టారాజ్యంగా పనులు
పనుల్లో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూమిలో అరకొరగా జంగిల్ ఉన్నప్పుటికీ ఎక్కువగా ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేసి నిధుల స్వాహాకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆదే విధంగా మొక్క నాటేందుకు 30 సెం.మీ లోతు, వెడల్పుతో గుంతలు తీయాల్సి ఉన్నా ౖపైపెనే గుంతలు తీసి నాటుతున్నారు. దీంతో మొక్కలు ఏపుగా పెరిగే అవకాశం ఉండదు. ఎండబెట్టకు మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. మొక్కలు నాటేటప్పడు రసాయనిక ఎరువులు (డీఏపీ, యురియా, ఫాస్పరస్) గుంతల్లో వేసి మట్టి కప్పివేయాలి. కానీ ఎరువులు వేయడం లేదు. అన్నీ వేసినట్లుగా ఎం.బుక్‌ల్లో నమోదు చేసుకొని పెద్ద మొత్తంలో నిధులు స్వాహాకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా వరికుంటపాడు మండలం విరువూరులో కూడా 40 హెక్టార్లలో మొక్కలు పెంచేందుకు మరో రూ.30 లక్షలు నిధులు మంజూరయ్యాయి.
ఈ నిధులతో పనులు దాదాపు పూర్తి చేశారు. ఇక్కడ కూడా ఇదే తరహా తంతు సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీఎస్‌ఎస్ కమిటీలు తాము పని చేస్తామని అడిగితే 40 శాతం లంచం రూపంలో కమీషన్ ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో తాము పనులు చేయలేకపోతున్నట్లు కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయగిరి రేంజ్ పరిధిలోని అన్ని వీఎస్‌ఎస్‌లలో ఇదే తంతు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతం నుంచి రేంజ్ పరిధిలో జరిగిన వివిధ పనులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపితే అవినీతి గుట్టు రట్టువుతుందని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయాలపై వరికుంటపాడు బీట్ అధికారి రసూల్‌ను అడగగా అంతా పై అధికారులు చూసుకుంటారని తెలిపారు. ఎం.బుక్ తాము చేసినా పై అధికారులు ఎలా చెబితే అలా చేస్తామని అన్నారు.

కనియంపాడు ఏరియాలో మొక్కల ప్లాంటేషన్

No Headline