
మేకపిల్లను రక్షించే ప్రయత్నంలో..
● బావిలో దిగి వృద్ధుడి మృతి
ఉదయగిరి: మండలంలోని శకునాలపల్లి గ్రామ సమీపంలో ఉన్న వ్యవ సాయ బావిలో దిగి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఈర్ల వెంకటయ్య (75) బుధవారం తన జీవాలను అడవికి మేతకు తోలుకెళ్లాడు. మందలోని మేకపిల్ల బావిలో పడిపోవడంతో దానిని రక్షించేందుకు వెంకటయ్య బావిలోకి దిగాడు. మేకపిల్లను రక్షించి బయటకు తీసుకొచ్చే క్రమంలో బావిలో అల్లుకుపోయిన తామర వేర్లు కాళ్లకు చుట్టుకొని మునిగిపోయాడు. వెంకటయ్యకు భోజనం ఇచ్చేందుకు భార్య చుట్టుపక్కల గాలించి బావి వద్దకు వచ్చి చూసింది. అక్కడ చెప్పులు, వాటర్‌బాటిల్ ఉండటంతో వెంటనే గ్రామంలోకి వెళ్లి విషయాన్ని తెలిపింది. గ్రామస్తులు బావి వద్దకు చేరుకుని వెంకటయ్యను బయటకు తీసేందుకు ప్రయత్నించగా చీకటి పడడంతో వెనుదిరిగారు. గురువారం ఉదయం వెంకటయ్య మృతదేహాన్ని వెలికితీశారు. సమాచారం అందుకున్న ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.