కావలి: ప్రశాంతంగా ఉన్న దగదర్తి మండలంలో పోలీసుల వైఖరి తీవ్ర వివాదాస్పదంగా మారుతుంది. మండలంలోని వైఎస్సార్‌సీపీ నాయకులను టార్గెట్ చేసి బైండోవర్ పేరుతో ముందుగానే అదుపులోకి తీసుకునేలా పోలీసులు వ్యవహరిస్తుండడం విమర్శలకు దారి తీసింది. ఎస్పీ ఆదేశాలంటూ సోమవారం మధ్యాహ్నం నుంచి దగదర్తి పోలీసు సిబ్బంది వైఎస్సార్‌సీపీ నాయకులకు ఫోన్లు చేయడం ప్రారంభించారు. స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేసి వెళ్లాలని, బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని చెబుతుండటంతో వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఎంపీపీ తాళ్లూరు ప్రసాద్‌నాయుడుకు కూడా ఎస్సై ఫోన్ చేసి స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేసి వెళ్లాలని చెప్పడం గమనార్హం. ఎస్పీ ఆదేశాల మేరకు బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామ ని చెప్పడంతో ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉత్తర్వుల కాపీ వాట్సప్‌లో పంపాలని కోరగా ఎస్సై నిరాకరించాడు. స్టేషన్‌కు వస్తే చూపిస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఎంపీపీ అసహనానికి గురయ్యాడు. టీడీపీ నాయకులను కూడా బైండోవర్ చేస్తున్నారా? అని ప్రశ్నించినా సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఎటువంటి కేసులు లేని ప్రజాప్రతినిధిని, మండల ప్రథమ పౌరుడి హోదాలో ఉన్న ఎంపీపీతోనే ఫోన్‌లో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కౌంటింగ్ తేదీ దగ్గరపడే సమయంలో కేవలం వైఎస్సార్‌సీపీ నాయకులనే పోలీసులు టార్గెట్ చేసి స్టేషన్‌కు పిలిపిస్తుండడం వివాదాలకు దారి తీసేలా మారింది. ఈ విషయంపై దగదర్తి ఎస్సైను ఫోన్‌లో సంప్రదించగా స్పష్టమైన సమాధానం చెప్పలేక దాటవేత ధోరణిలో మాట్లాడారు. కౌన్సెలింగ్ అని, బైండోవర్ అని పొంతనలేని సమాధానాలు చెప్పారు. చివరగా సీఐతో మాట్లాడి పూర్తి వివరాలు చెబుతానని తెలిపాడు.
బైండోవర్ చేసేందుకు
పోలీసుల యత్నం
నాయకులకు ఫోన్ చేసి స్టేషన్‌కు రావాలంటూ హూంకరింపు
బరితెగించిన పోలీసులు
ఎన్నికల సమయంలో దగదర్తి మండలం తడకలూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త చిరంజీవి పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేతల ఆక్రమాలను అడ్డుకున్నారని, అతనిపై టీడీపీ రౌడీమూకలు, జలదంకి శ్రీహరినాయుడు, అతని తమ్ముడు మనోహర్‌నాయుడుతో పాటు వారి గ్యాంగ్ హత్యాయత్నం చేసినా.. పోలీసులు కనీసం కేసు నమోదు చేయకుండా ఆ పార్టీ నేతలకు కొమ్ముకాస్తూ అడ్డంగా పనిచేశారు. ఈ దాడులో పాల్గొన్న శ్రీహరినాయుడు వెంకటగిరి నియోజకవర్గంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తుండడం గమనార్హం. దీంతో కేసు తీవ్రతను నీరుగార్చేయత్నం చేశారు. ఇంతగా బరి తెగించిన పోలీసులు కనీసం మండలంలో టీడీపీ నేతలపై ఎలాంటి కేసులు నమోదు చేయకపోగా, తాజాగా బైండోవర్ కేసుల పేరుతో వైఎస్సార్‌సీపీ నేతలను వేధిస్తున్నారు.