
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
కొడవలూరు: కొడవలూరు మండలం టపాతోపు వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంకు చెందిన 8 మంది మారుతి ఎర్టిగా కారులో బ్రహ్మంగారిమఠం, ఒంటిమిట్ట రామాలయాలను దర్శించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. టపాతోపు క్రాస్‌రోడ్డు వద్ద ముందు వెళుతున్న లారీ హఠాత్తుగా స్లో చేయడంతో వెనుక వస్తున్న కారు వేగం అదుపు కాక లారీ వెనుక భాగాన ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న అట్ల ఏడుకొండలరెడ్డి, గుడివాడ దుర్గారావు, అన్నం కోదండరామిరెడ్డి, అసోది మల్లారెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. మల్లారెడ్డి పరిస్ధితి కాస్త మెరుగ్గా ఉండగా, మిగిలిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కారులో ఉన్న మరో నలుగురు సురక్షితంగా బయట పడ్డారు. వీరంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతోపాటు బాగా పరిచయస్తులు కావడంతో ప్రత్యేక కారులో దైవ దర్శనానికి బయలు దేరినట్లు బాధితులు తెలిపారు.
మానవత్వం చాటుకొన్న వైద్య విద్యార్థినులు
ప్రమాదం జరిగిన సమయంలో జాతీయ రహదారిపై కారులో వెళుతున్న వైద్య విద్యార్థినులు కొందరు తమ వాహనాన్ని ఆపి బాధితులకు ప్రాథమిక చికిత్స చేసి మానవత్వం చాటుకొన్నారు. సంఘటనా స్ధలికి చేరుకొని కారులో ఉన్న ప్రమాద బాధితులను స్ధానికుల సాయంతో వెలికి తీయడంతోపాటు వారందరికీ ప్రాథమిక చికిత్స అందించారు. 108 వాహనానికి సమాచారం ఇచ్చి వారందర్నీ అందులోకి తరలించడంలో ఎంతో చొరవ చూపారు. వైద్య విద్యార్థినుల చొరవను అందరూ ప్రశంసించారు. ఎస్సై కె.వీరప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీని వెనుక నుంచి ఢీకొన్న కారు
నలుగురికి తీవ్ర గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
క్షతగాత్రులంతా బాపట్ల జిల్లా వాసులు

అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం