శాపంగా నారాయణ గారడీలు | - | Sakshi
Sakshi News home page

శాపంగా నారాయణ గారడీలు

Apr 5 2024 12:15 AM | Updated on Apr 5 2024 10:15 AM

- - Sakshi

‘నెల్లూరును స్మార్ట్‌ సిటీగా మారుస్తున్నాం..నగర సుందరీకరణే నా ధ్యేయం.. భూగర్భ డ్రైనేజీతో మెరుగైన పారిశుధ్యాన్ని అందిస్తాం’అంటూ గత ప్రభుత్వ హయాంలో మంత్రిగావ్యవహరించిన నారాయణ తన ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను ఆ రోజుల్లో ఊదరగొట్టారు. ఇవన్నీ జరగకపోగా.. తనలోపభూయిష్ట విధానాలతో నెల్లూరు నగరపాలక సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టారు. హడ్కో ద్వారా రుణాలను తీసుకొచ్చి.. పనులను చేయకుండానే నిధులను దిగమింగారు. ఈ పరిణామాలతో ఆ అప్పులపై కార్పొరేషన్‌ ఏటా రూ.55 కోట్ల వడ్డీని కడుతోంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గత టీడీపీ హయాంలో మంత్రిగా వ్యవహరించిన నారాయణ పాపాలు నగర వాసులను నేటికీ వెంటాడుతున్నాయి. వీటన్నింటినీ విస్మరించి తాజాగా జరగనున్న ఎన్నికల్లో తనను గెలిపించాలంటూ ఆయన అవాస్తవాలను ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ‘నారాయణ అంటే అభివృద్ధి.. అభివృద్ధి అంటే నారాయణ’ అంటూ నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు.

9.95 శాతం వడ్డీకి అప్పు
నగరపాలక సంస్థలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా కోసం రూ.1136 కోట్ల రుణానికి హడ్కోను ఆశ్రయించారు. ఇందులో తాగునీటి సరఫరా కోసం రూ.556 కోట్లు, భూగర్భ డ్రైనేజీకి రూ.580 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే హడ్కో రూ.830 కోట్లను 9.95 శాతం వడ్డీకి 2016లో మంజూరు చేసింది. అయితే నామమాత్రపు పనులతో 2018 వరకు కాలం వెళ్లదీశారు.

గత ఎన్నికలకు ముందు హడావుడిగా..
గత ఎన్నికలకు కొన్ని నెలల ముందు రెండు ప్రముఖ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలకు టెండర్లను ఖరారు చేశారు. అప్పటికే నగరంలో ఒకట్రెండు వీధుల్లో మినహా మిగిలిన అన్ని రోడ్లు బాగానే ఉన్నాయి. భూగర్భ డ్రైనేజీ పేరుతో రోడ్లను తవ్వి.. అసంపూర్తిగా పనులు చేసి వదిలేశారు. ధ్వంసమైన రోడ్లపై నడిచేందుకు సైతం వీల్లేని పరిస్థితి ఏర్పడింది. భూగర్భ డ్రైనేజీ పైప్‌లైన్లను అన్ని వీధుల్లో వేస్తేనే గానీ సిమెంట్‌ రోడ్ల నిర్మాణానికి వీలుంటుంది. ఈ తరుణంలో గుంతలమయమైన రోడ్లతో ప్రజలు నరకాన్ని చవిచూశారు.

డివిజన్‌ ఇన్‌చార్జీలకు సబ్‌ కాంట్రాక్ట్‌లు..!
సిమెంట్‌ రోడ్ల పనులను తమకే కేటాయించాలంటూ నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్ల టీడీపీ ఇన్‌చార్జీలు నారాయణపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సదరు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలతో మాట్లాడి నిర్మాణాల పనులు వారికి అప్పగించారు. ఈ తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవుతుందనగా, నాణ్యత ప్రమాణాలను పాటించకుండా ఎత్తుపల్లాలుగా.. అత్యంత నాసిరకంగా రోడ్లను నిర్మించారు. కొన్ని వీధుల్లోని రోడ్లు వారానికే కుంగిపోయాయంటే నాణ్యత ఎలా ఉంతో అర్థం చేసుకోవచ్చు. గుంతలమయంగా.. వర్షమొస్తే చెరువులను తలపిస్తూ.. పైప్‌లైన్ల లీకేజీలు.. ఇలా రోడ్లు దుర్భరంగా మారాయి. చిన్నపాటి లీకేజీని సైతం సరిదిద్దేందుకు రోడ్లను ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఉండేది.

అసంపూర్తిగా ఉన్నా.. బిల్లుల మంజూరు
హడావుడిగా చేసిన పనులకు బిల్లులను మాత్రం పూర్తిగా తీసుకున్నారు. పనులు అసంపూర్తిగా ఉన్నాయని.. బిల్లులను మంజూరు చేయలేమని ఇంజినీరింగ్‌ అధికారులు చెప్పినా, నారాయణ మౌఖిక ఆదేశాలతో వీటికి ఇవ్వక తప్పలేదు. కొన్ని బిల్లులను అధికారులు క్లియర్‌ చేయకపోవడంతో ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి.

స్వచ్ఛ నీరు.. కాలువల పాలు
నగర వాసులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో పైపులను ఇళ్ల వద్ద ఏర్పాటు చేసి ఓపెన్‌గా వదిలేశారు. ఈ పైపుల ద్వారా ప్రతి ఇంటికీ కుళాయిని ఏర్పాటు చేసి.. వినియోగాన్ని లెక్క కట్టేందుకు మీటర్లను బిగిస్తామని చెప్పారు. అయితే ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆ ఓపెన్‌ పైపుల ద్వారా విడుదలయ్యే నీరు కాలువల పాలైంది. మరికొన్ని చోట్ల పైపులు చోరీకి గురయ్యాయి. నగరంలో అసంపూర్తిగా ఉన్న భూగర్భ డ్రైనేజీ, స్వచ్ఛమైన తాగునీటి పనులను పూర్తి చేయాలంటే మరో రూ.240 కోట్లు అవసరమవుతాయని నగరపాలక సంస్థ ఇంజినీరింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

వడ్డీ భారం ఇలా.. 
హడ్కో నుంచి తెచ్చిన రుణానికి 9.95 శాతం వడ్డీని ఏటా చెల్లించాలి. అసలు కింద రూ.80 కోట్లు.. వడ్డీగా రూ.55 కోట్లు.. ఇలా ఏడాదికి రూ.135 కోట్లను నగరపాలక సంస్థ చెల్లించాల్సి వస్తోంది. ఆరేళ్లుగా రూ.810 కోట్లను కార్పొరేషన్‌ చెల్లించింది. ఈ లెక్కన ఇంకా దాదాపు రూ.400 కోట్లను అసలు, వడ్డీ కింద జమ చేయాల్సి ఉంది. ఇలా నగరపాలక సంస్థను అప్పుల ఊబిలోకి నారాయణ లాగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement