9 నుంచి పది ప్రీ పబ్లిక్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

9 నుంచి పది ప్రీ పబ్లిక్‌ పరీక్షలు

Feb 7 2026 2:55 PM | Updated on Feb 7 2026 2:55 PM

9 నుంచి  పది ప్రీ పబ్లిక్‌ పరీక్షలు

9 నుంచి పది ప్రీ పబ్లిక్‌ పరీక్షలు

నెల్లూరు (టౌన్‌): జిల్లాలోని అన్ని యాజమాన్య పరిధిలో గల ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్‌ పరీక్షలను ఈ నెల తొమ్మిది నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలను జరపనున్నారు. తొమ్మిదిన తెలుగు / ఉర్దూ / కాంపోజిట్‌ కోర్సు, పదిన హిందీ / స్పెషల్‌ తెలుగు / స్పెషల్‌ ఇంగ్లిష్‌, 11న ఇంగ్లిష్‌, 12న మ్యాథ్స్‌, 13న భౌతిక శాస్త్రం, 16న జీవశాస్త్రం, 17న సోషల్‌ స్టడీస్‌, 18న కాంపోజిట్‌ కోర్సు – 2, 19న ఓఎస్సెస్సీ – 2 ఒకేషనల్‌ కోర్సు పరీక్షలను నిర్వహించనున్నారు. అదే విధంగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఎఫ్‌ఏ – 4 పరీక్షలను ఈ నెల తొమ్మిది నుంచి 12 వరకు జరపనున్నారు. వీటికి ఎస్సీఈఆర్టీ నుంచి ప్రశ్నపత్రాలను ఇవ్వనున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు క్లస్టర్‌ కేంద్రాలు.. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు సంబంధించిన ప్రశ్నపత్రాలను మండల విద్యా వనరుల కేంద్రాల నుంచి గంట ముందు పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. అనంతరం అసెస్మెంట్‌ బుక్‌లెట్ల మూల్యాంకనం చేసి మార్కులను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది.

ధాన్యానికి మద్దతు ధర

నెల్లూరు(పొగతోట): ధాన్యం కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా మద్దతు ధర కల్పించాలని డీఎస్‌ఓ లీలారాణి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో వివిధ శాఖల ఉద్యోగులకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో వచ్చే నెల నుంచి వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. క్వింటాల్‌ గ్రేడ్‌ – ఏ ధాన్యం రూ 2389.. సాధారణ ధాన్యం క్వింటాల్‌ ధరను రూ.2369గా ప్రభుత్వం ప్రకటించిందని వివరించారు. మద్దతు ధరకు మించి కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. తేమ శాతం, నిబంధనలను పూర్తి స్థాయిలో పరిశీలించి సేకరించాలని కోరారు. ఆపై రైస్‌మిల్లలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

డీఏఓ నియామకంపై ఇరిగేషన్‌లో కలకలం

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జిల్లా ఇరిగేషన్‌ శాఖను రాష్ట్ర వ్యాప్తంగా అప్రతిష్టపాల్జేసిన గత డీఏఓ అక్రమాలపై విచారణ జరిపి నెల రోజులు కాక ముందే ఆయన హఠాత్తుగా బాధ్యతలను శుక్రవారం స్వీకరించారు. వాస్తవానికి విచారణ జరిగిన రోజే ఆయన మాతృశాఖ ఫైనాన్స్‌ అండ్‌ ఆడిట్‌కు సరెండరై వెళ్లిపోయారు. అనంతరం ఆ పోస్టు భర్తీకి అనేక మంది చాలా విధాలుగా యత్నించారు. అయితే తాజాగా డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా హరిప్రసాద్‌ బాధ్యతలు చేపట్టడం ఆ శాఖ అధికారులు, సిబ్బందిని విస్మయానికి గురిచేసింది. బాధ్యతలు స్వీకరించేంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. ఈయన మరో రెండు, మూడు చోట్ల డీఏఓగా పనిచేస్తున్నారని సమాచారం. ఇరిగేషన్‌ శాఖలో గ్రేడ్‌ – 1 డీఏఓలు పనిచేస్తుండగా, గ్రేడ్‌ – 2 వ్యక్తిని నియమిస్తూ రాష్ట్ర వర్క్స్‌ ఆండ్‌ ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ ఉత్తర్వులివ్వడంపై ఇరిగేషన్‌ సెంట్రల్‌ డివిజన్‌ సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా తనకు కావలి ఆర్‌ అండ్‌ బీలో డీఏఓ పదవి నుంచి గూడూరు ఇరిగేషన్‌, నెల్లూరు సెంట్రల్‌ డివిజన్‌ డీఏఓగా అదనపు బాధ్యతలను ఉన్నతాధికారులు అప్పగించారని ఆయన తెలిపారు.

ఈఎమ్మార్‌ఎస్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

కొడవలూరు: మండలంలోని చంద్రశేఖరపురంలో గల ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ (ఈఎమ్మార్‌ఎస్‌)లో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆన్‌లైన్లో ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్‌ శాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో 60 సీట్లుండగా.. బాలురు, బాలికలకు 30 చొప్పున కేటాయించనున్నామని వివరించారు. 2025 – 26 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న వారే దీనికి అర్హులని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు తమ దరఖాస్తులను aptwgurukulam.ap.gov.inలో ఈ నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్షను ఏప్రిల్‌ నాలుగో తేదీ ఉదయం 11.30కు నిర్వహించనున్నారని, వివరాలకు 95736 60645, 90001 65505 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement