గంజాయి మత్తులో బాలికపై దారుణం | - | Sakshi
Sakshi News home page

గంజాయి మత్తులో బాలికపై దారుణం

Feb 7 2026 2:55 PM | Updated on Feb 7 2026 2:55 PM

గంజాయి మత్తులో బాలికపై దారుణం

గంజాయి మత్తులో బాలికపై దారుణం

మొన్న పెంచలయ్య.. నేడు బాలిక

మత్తుకు బానిసలవుతున్న బాలురు.. విచక్షణ కోల్పోయి నేరాలు

అరాచకాలకు అడ్డుకట్టలో అధికార యంత్రాంగాల ఘోర వైఫల్యం

అధికార పార్టీ నేతల సేవలో తరిస్తున్న వైనమే ఈ పరిస్థితికి కారణం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గంజాయి అరాచక శక్తులకు అడ్డాగా జిల్లా మారిపోయింది. ఒకప్పుడు నేరస్తుల గుండెల్లో సింహ స్వప్నంగా మారి వారి పీచమణిచిన పోలీసుల సమర్థత ప్రస్తుతం పాతాళానికి పడిపోయింది. జిల్లా పోలీస్‌ బాస్‌లుగా వ్యవహరించిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి, కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి, ఈతమొక్కల దామోదర్‌, సెంథిల్‌కుమార్‌, పీహెచ్‌డీ రామకృష్ణ వంటి అనేక మంది అధికారులు కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకొని అరాచక శక్తుల ఆటకట్టించారు. నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితులను తీసుకొచ్చి, పోలీస్‌ ప్రతిష్టను ఇనుమడింపజేశారు. నేరాలను అరికట్టేందుకు అవసరమైతే అండగా నిలిచే పాలకులు గతంలో ఉండటంతో పోలీస్‌ బాస్‌లు సైతం ఖాకీ పవర్‌ చూపించారు. ప్రస్తుతం నేరాలను ప్రోత్సహిస్తున్న పాలకుల చేతిలో కీలుబొమ్మల్లా మారిన ఖాకీలు ఉండటంతో జిల్లా నేరమయంగా మారింది. నేరస్తులను పబ్లిక్‌ రోడ్లపై పరేడ్‌ చేయిస్తూ.. తద్వారా నేర నియంత్రణలో కఠినంగా వ్యవహరిస్తున్నామనే భ్రమలను కల్పిస్తున్నారు.

గుప్పుమంటున్న గంజాయి

కూటమి ప్రభుత్వంలో ఎక్కడా చూసినా గంజాయి గుప్పుమంటోంది. నగరం, పట్టణమనే తేడా లేకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయిన వారు నేరాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. నిలువరించాల్సిన పోలీస్‌, ఎకై ్సజ్‌ ఈగల్‌ టీమ్‌లు నామమాత్రపు చర్యలతో సరిపెట్టుకుంటున్నారు. సంబంధిత అధికారులు ఏదైనా సమాచారం వస్తేనో.. పైఅధికారుల ఆదేశాలతోనే అడపాదడపా దాడులు చేసి నిందితుల అరెస్ట్‌లతో సరిపెట్టుకుంటున్నారు. మూలాల్లోకి వెళ్లకపోవడంతో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు బ్రేక్‌ పడటం లేదు. దీంతో జిల్లాలో గంజాయి విక్రయాలు చాపకింద నీరులా సాగుతున్నాయి. మత్తులో నేరాలు పెరుగుతుండటంతో జిల్లా వాసులు భయపడుతున్నారు. జిల్లాలో జరుగుతున్న నేరాలు అధిక శాతం మత్తులోనే జరుగుతున్నాయని పోలీసుల విచారణలోనూ స్పష్టమైంది.

మొక్కుబడి నిఘా

నార్కొటిక్స్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సమన్వయ సమావేశంలో కలెక్టర్‌, ఎస్పీలు అన్నీ శాఖల సమన్వయంతో జిల్లాను డ్రగ్స్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కింది స్థాయి అధికారులకు ఆదేశిస్తున్నారు. వారి ఆదేశాల అమలు క్షేత్రస్థాయిలో నామమాత్రంగానే ఉన్నాయనే విమర్శలున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయకపోతే శాంతిభద్రతలకు మరింత విఘాతం ఏర్పడే పరిస్థితి ఏర్పడనుంది.

ఈ దారుణానికి బాధ్యులెవరు..?

గతంలో ఉక్కుపాదంతో అణచివేత

గంజాయిపై గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎక్కడికక్కడ దాడులు చేసి గంజాయి సరఫరాదారులు, విక్రేతలను అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కి పంపారు. గంజాయి మూలాలను ఏరివేసి పూర్తిస్థాయిలో కట్టడి చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఒడిశా, ఏఓబీ సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గంజాయి జిల్లా మీదుగా కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు తరలివెళ్తోంది. గంజాయి విక్రయాలు ఊపందుకున్నాయి. జిల్లాలోని వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా వివిధ మార్గాల ద్వారా గంజాయిని దిగుమతి చేసుకుంటున్నారు. చిన్న చిన్న పొట్లాలుగా చేసి వాటిని విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లోనూ గంజాయి విక్రయాలు చాపకిందనీరులా సాగుతున్నాయి. మత్తుకు బానిసైన యువత నేరాలకు పాల్పడుతున్నారు. హత్యలకు, హత్యాయత్నాలకు వెనుకాడటం లేదు. బాలికలపైనా మత్తులో దాడులకు తెగబడుతున్నారు. మత్తులో మృగాళ్ల వికృత చేష్టలకు అభం శుభం తెలియని ఓ బాలిక ప్రాణాలను కోల్పోయింది.

జిల్లాలో గంజాయి దాష్టీకానికి తాజాగా బాలిక బలైపోయింది. ఇటీవల గంజాయి నిరోధక ఉద్యమకారుడు పెంచలయ్యను విక్రేతలు ప్రజలు చూస్తుండగానే తరిమితరిమి నరికి చంపారు. ఇప్పుడు గంజాయి మత్తులో ఇద్దరు బాలలు.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడటంతో ప్రాణాలే కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే దానికి ఈ రెండు ఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఖాకీ దుస్తులు ధరించిన పోలీసులు, ఎకై ్సజ్‌ అధికారులు అవినీతి, అధికార మత్తులో పడి అసాంఘిక శక్తుల ఆటకట్టించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ దాష్టీకాలను ప్రశ్నించే ప్రతిపక్షంపై కేసులు నమోదు చేయడం, ఉద్యమాలను అణచివేయడంలో చూపించే శ్రద్ధ, వీటిపై లేకపోవడంతోనే అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయి.

కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో అభం శుభం తెలియని బాలికపై జరిగిన దారుణానికి కారకులెవరు..? గంజాయిని నిరోధించలేని పోలీసులు, ఎకై ్సజ్‌ అధికారులు కాదా..? బాలికపై దారుణానికి గంజాయి కారణమని తెలిసినా.. ఈ ఘటనకు మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. నేరం జరిగినట్లుగా నిర్ధారించి నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి జువైనల్‌ హోమ్‌కు తరలించడం నిజం కాదా..? బాలిక మరణించడంతో తమ అసమర్థత ఎక్కడ బయట పడుతుందోనని 12 ఏళ్ల బాలికకు ప్రేమ వ్యవహారం అంటగట్టి ఆ కుటుంబాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు సైతం వెనుకాడటంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరో బిడ్డకు జరగకూడదని, తమ బిడ్డకు ప్రేమ వ్యవహారాన్ని అంటగట్టారంటూ ఆ తండ్రి గుండెలు పగిలేలా రోదిస్తున్నాడు. వేలకు వేల జీతాలు, రూ.లక్షల్లో అవినీతి మరిగిన ఈ రెండు వ్యవస్థలు విచ్చలవిడిగా జరిగే గంజాయి విక్రయాలను అరికట్టడం, మద్యాన్ని నియంత్రించలేకపోవడంలో నిజం లేదా..? తమ వైపు తప్పులను కప్పి పుచ్చుకునేందుకు అసలు రేప్‌ జరగలేదంటూ చెప్పడం బాధ్యతారాహిత్యం కాదా..? పోలీసులు చెప్పినట్లు రేప్‌ జరగకపోతే ఆ పిల్లలను ఎందుకు అరెస్ట్‌ చేశారంటే.. ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా సమాధానాలు చెప్పారు. గంజాయి తాగుంటే పట్టుకున్నామని ఒకరికి.. పోక్సో కేసు ఎందుకు నమోదు చేశారంటే ఆ బాలికను లైంగికంగా వేధించారని.. దీనికి కూడా పోక్సో కేసు పెట్టామంటూ కొత్త భాష్యం చెప్పారు. పోలీసులు చెప్పినట్లే చూసినా.. దీనింతటికీ గంజాయే కారణం కాదా..? దాన్ని నియంత్రించకపోవడమే కారణం కాదాననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement