నెల్లూరు (క్రైమ్): నగరంలోని కొండాయపాళెం గేటుకు సమీపంలోని రైలు పట్టాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం గుర్తించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అతను ట్రైన్ ఢీకొని చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. తెలుపు రంగుపై.. పసుపు రంగు గీతల ఫుల్ హ్యాండ్స్ షర్టు, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడు. వయసు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండొచ్చని చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు డ్రైవర్‌పై దాడి
ఇందుకూరుపేట: మండలంలోని కొత్తూరులో ముగ్గురు వ్యక్తులు బస్సు డ్రైవర్‌పై దాడి చేశారు. ఈ ఘటన మంగళవారం జరగ్గా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై వీరేంద్రబాబు కథనం మేరకు.. కోవూరు మండలం పోతిరెడ్డిపాళేనికి చెందిన గుంజి శ్రీనివాసులు నెల్లూరు – కొరుటూరు ఆర్టీసీ బస్సుకు డ్రైవర్‌గా ఉన్నాడు. కరిముల్లా అనే కండక్టర్‌తో కలిసి నెల్లూరు నుంచి కొరుటూరుకు ప్రయాణికులతో బయలుదేరాడు. దారిలో డేవిస్‌పేటకు వచ్చేసరికి ఓ వ్యక్తి బస్సును ఆపాడు. అయితే అతను ఎక్కకుండా వెళ్లిపోమని చెప్పాడు. దీంతో డ్రైవర్ శ్రీనివాసులు కొరుటూరుకు బయలుదేరాడు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చేసరికి బస్సు ఆపిన వ్యక్తితోపాటు మరో ఇద్దరు కలిసి మోటార్‌బైక్‌ను రోడ్డుకు అడ్డుగా నిలిపారు. డ్రైవర్ వాహనాన్ని ఆపగా లోపలికి వెళ్లి కండక్టర్‌ను దుర్భాషలాడారు. శ్రీనివాసులుపై దాడి చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందగా నిందితులను డేవిస్‌పేట చెందిన వెంకటేష్, సాయికుమార్, మౌళిగా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వివరించారు.