
చెత్తను తరలిస్తున్న టిప్పర్లు
పరిశ్రమల నిర్వాహకుల ఇష్టారాజ్యం.. అధికారులు పట్టించుకోకపోవడం వెరసి వెంకటాచలం మండలం కాకుటూరు పంచాయతీ పరిధిలోని పరిశ్రమల కేంద్రం చెత్త నిల్వల కేంద్రంగా మారిపోయింది. ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసే కొన్ని పరిశ్రమలు నిబంధనలు పాటించకుండా రోడ్లపైనే ప్లాస్టిక్‌ను నిల్వ చేస్తున్నాయి. అలాగే నెల్లూరు నగరంలోని చెత్తను పరిశ్రమల కేంద్రం వద్ద డంపింగ్ చేయడంతో ఈ ప్రాంతమంతా కంపు కొడుతోంది. సమీపంలోనే విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉండడంతో విద్యార్థులతోపాటు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు దుర్వాసన భరించలేకపోతున్నారు. ఇదేం చెత్త పని అంటూ నిలదీస్తున్నారు.
వెంకటాచలం: మండలంలోని కాకుటూరు పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి పక్కనే ఉన్న పరిశ్రమల కేంద్రం మధ్యలో తిక్కవరప్పాడు బ్రాంచ్ కెనాల్, వెనుక వైపున విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉన్నాయి. ఈ పరిశ్రమల కేంద్రంలోని మొత్తం 35 ఎకరాల్లో 50కు పైగా పరిశ్రమలు ఉండగా, నాలుగు ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలు ఉన్నాయి. జిల్లా నలుమూలల నుంచి తీసుకువచ్చిన ప్లాస్టిక్‌ను పరిశ్రమల నిర్వాహకులు రోడ్లపైనే నెలల తరబడి ఉంచుతున్నారు. నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే పరిశ్రమల నిర్వాహకులు తమ పరిశ్రమ ప్రాంగణంలోనే నిల్వ ఉంచుకోవాలి. కానీ నిబంధనలను అతిక్రమిస్తూ రోడ్లపై, ఖాళీ స్థలాల్లో నిల్వ ఉంచుతున్నారు. అలాగే నెల్లూరు నగరంలో వచ్చే చెత్తను వేసేందుకు కొత్తూరు ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఉంది. ఈ డంపింగ్ యార్డుకు నెల్లూరు నుంచి చెత్తను తీసుకువెళ్లే టిప్పర్లు కొన్ని జాతీయ రహదారిపై వచ్చి తిక్కవరప్పాడు బ్రాంచ్ కెనాల్‌పై వెళ్లి డంపింగ్ యార్డ్‌లో చెత్తను అన్‌లోడ్ చేస్తున్నాయి. అయితే కొందరు టిప్పర్ల డ్రైవర్లు డంపింగ్ యార్డు వరకు వెళ్లకుండా తిక్కవరప్పాడు బ్రాంచ్ కెనాల్ పొడవునా చెత్తను అన్‌లోడ్ చేసి వెళ్లిపోతున్నారు. దీంతో నగరంలోని చెత్త మొత్తం తిక్కవరప్పాడు బ్రాంచ్ కెనాల్‌లోనూ, కట్టపైనే చేరుతోంది. కాలువ కట్టపై చెత్తను వేయడంతో సమీపంలో ఉన్న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలోని హాస్టల్ విద్యార్థులు, పరిశ్రమల్లో పనిచేస్తున్న సిబ్బంది ఈ దుర్వాసన భరించలేకపోతున్నారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న డంపింగ్ యార్డ్‌లోనే చెత్తను డంప్ చేసేలా అధికారులు చర్యలు చేపడితే విద్యార్థులకు ఎలాంటి సమస్య ఉండదు. కానీ విశ్వవిద్యాలయం హాస్టల్‌కు సమీపంలో చెత్త డంప్ చేయడంతో దుర్వాసనకు తట్టుకోలేక కొందరు విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు.
కంపు బాబోయ్
కాకుటూరు పంచాయతీలోని పరిశ్రమల కేంద్రంలో ఉన్న కొన్ని పరిశ్రమల నిర్వాహకులు వ్యర్థాలను కూడా ఖాళీ స్థలాల్లోకి వదిలివేయడంతో వర్షాకాలంలో సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటోంది. మిగతా పరిశ్రమల నిర్వాహకులు, అధికారులు ఈ సమస్యను పట్టించుకోవడం లేదు. పరిశ్రమల్లోని సిబ్బందే కాక, జాతీయ రహదారి సమీపంలో కాలువ ఉండడంతో వాహనచోదకులు ఈ కంపును భరించలేకపోతున్నారు. నిత్యం అధికారులు రాకపోకలు సాగిస్తున్నా, ముక్కుమూసుకుని వెళుతున్నారే గానీ చెత్త ఎందుకు అన్‌లోడ్ చేస్తున్నారని ఎవరూ ప్రశ్నించిన దాఖలాలు లేవు. గతంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అధికారులు ఈ సమస్యను నెల్లూరు కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో కొన్ని రోజులపాటు టిప్పర్ డ్రైవర్లు తిక్కవరప్పాడు బ్రాంచ్ కెనాల్ వద్ద చెత్త డంపింగ్ చేయకుండా వెళ్లేవారు. మళ్లీ గత కొద్ది నెలలుగా టిప్పర్ డ్రైవర్లు యథావిధిగా కాలువ కట్టపై డంపింగ్ చేస్తుండడంతో ఆ ప్రాంతమంతా కంపు కొడుతోంది. ఈ సమస్యపై అధికారులు దృషిసారించి చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.
కాకుటూరు పరిశ్రమల
కేంద్రంలో చెత్త నిల్వలు
కంపు భరించలేకపోతున్న
వీఎస్‌యూ విద్యార్థులు

వీఎస్‌యూ హాస్టల్‌కు సమీపంలో తిక్కవరప్పాడు బ్రాంచి కెనాల్‌పై చెత్త కుప్పలు

పరిశ్రమల కేంద్రం మధ్యలో ఓ ప్లాస్టిక్ పరిశ్రమ నెలల తరబడి నిల్వ ఉంచిన ప్లాస్టిక్