గ్రంథాలయాలు..విజ్ఞాన కేంద్రాలు | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాలు..విజ్ఞాన కేంద్రాలు

Published Tue, Nov 14 2023 12:44 AM

ఉలవపాడు గ్రంథాలయ భవనం - Sakshi

నేటి నుంచి 56వ గ్రంథాలయ వారోత్సవాలు

ఉలవపాడు/చేజర్ల: విజ్ఞాన భాండాగారాలు గ్రంథాలయాలు. ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దే సరస్వతి నిలయాలు. ఇక్కడ విజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉన్నత శిఖరాలకు చేరిన వారెందరో ఉన్నారు. కంప్యూటర్‌ యుగంలోనూ పుస్తక పఠనంపైన యువత మొగ్గుచూపుతున్నారు. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ విషయమైన గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే సులువుగా దొరుకుతుంది. కానీ పుస్తక పఠనంలో ఉన్న తృప్తి కంప్యూటర్‌ సెర్చింగ్‌లో లేదంటున్నారు పాఠకులు. సాంకేతికత ఎంత పెరిగినా..ఎన్ని కంప్యూటర్లు వచ్చినా గ్రంథాలయాల ప్రత్యేకత కాదనలేనిది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయ వారోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు గ్రంఽథాలయ వారోత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందుకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గ్రంథాలయాల్లో చేపట్టాల్సిన కార్యాచరణను ప్రకటించింది. ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని 61 గ్రంథాలయాల్లో వారోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రంథాలయాల గ్రేడ్‌ల ఆధారంగా నిధులు కేటాయించారు. జిల్లాలో గ్రేడ్‌ 1–3, గ్రేడ్‌ 2–5, గ్రేడ్‌ 3–43, గ్రామీణ గ్రంథాలయాలు 10 ఉన్నాయి. ఆయా గ్రంథాలయాల్లో వారోత్సవాలు జరపాలని నిర్ణయించారు.

కార్యాచరణ ఇలా....

14న వారోత్సవాల ప్రారంభ వేడుకలు, బాలల దినోత్సవం జరపాలని నిర్ణయించారు. 15న పుస్తక ప్రదర్శన, డ్రగ్స్‌పై అవగాహన, పుస్తక పఠన ప్రాముఖ్యత, 16న గ్రంథాలయ ఉద్యమానికి పాటుబడిన గ్రంథాలయ ఉద్యమకారులకు నివాళులు 17న కవి సమ్మేళనం, రచయితల సందేశాలు, సెమినార్లు, 18న విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, క్విజ్‌ పోటీలు, క్రీడల నిర్వహణ, 19న మహిళా దినోత్స వం, దిశ చట్టం, మహిళా సాఽధికారితపై చర్చ, 20న డిజిటల్‌ లైబ్రెరీల వినియోగం, స్వీయపఠనం, చదవడం మాకిష్టం కార్యక్రమం, ముగింపు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.

బడ్జెట్‌ కేటాయింపు..

వారోత్సవాల నిర్వహణకు బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది. రెండేళ్ల ముందు బడ్జెట్‌ తక్కువగా ఉండేది. గత రెండేళ్ల నుంచి నిధులు స్వల్పంగా పెంచినట్లు అధికారులు తెలిపారు. జిల్లా గ్రంథాలయానికి రూ.35వేలు, గ్రేడ్‌1 శాఖా గ్రంథాలయానికి రూ.15వేలు, గ్రేడ్‌ 2 గ్రంథాలయాలకు రూ.11వేలు, గ్రేడ్‌ 3 శాఖా గ్రంథాలయాలకు రూ.8వేలు బడ్జెట్‌ లో కేటాయించారు. వారోత్సవాలకు సంబంధించిన బిల్లులు గ్రంథాలయ సంస్థకు అందజేసిన వెంటనే నిధులు అందించేలా ఏర్పాట్లు చేశారు.

వారోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

గ్రంథాలయ వారోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లాలోని గ్రంథపాలకుల అందరికీ ఆదేశాలు జారీ చేశాం. నిధులు కూడా అందుబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిరుద్యోగులకు అవసరమైన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నాం. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. – దొంతు శారద,

జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌

1/1

Advertisement
 
Advertisement