అణగారిన వర్గాలపై ఎందుకీ వివక్ష
● గిరిజన సంఘాల దీక్షకు వామపక్షాల మద్దతు
నెల్లూరు(దర్గామిట్ట): రాష్ట్ర ప్రభుత్వానికి అణగారిన వర్గాల పట్ల ఎందుకింత వివక్ష అంటూ వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద గిరిజన సంఘాల ఐక్యవేదిక చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారంతో ఆరో రోజుకు చేరుకున్నాయి. దీనికి వామపక్ష నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘ గౌరవాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ కత్తి శ్రీనివాసులు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. 50 ఏళ్ల తర్వాత నెల్లూరు మేయర్ పదవి ఎస్టీలకు దక్కితే, దీనిని చూసి ఓర్వలేక కుట్రలు పన్నడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. గిరిజన మహిళను దించి మరో సామాజిక వర్గానికి పెత్తనం ఇవ్వడం ఏమిటని దుయ్యబట్టారు. మంత్రి నారాయణ ఇలాకాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం నూతన మేయర్ ఎన్నికపై నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంఘాల నాయకులు పిట్ల సూర్యనారాయణ, ఎం.ప్రసాద్, ఎ.శ్రీనివాసులురెడ్డి, కత్తి చిన్న, సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, వివిధ సంఘాల నేతలు బాపట్ల శివకృష్ణ, చౌటురు శ్రీనివాసులు, తాళ్ల ఏడుకొండలు పాల్గొన్నారు.


