వనమూలికలు, ఔషధ మొక్కలకు నిలయమైన ఉదయగిరి దుర్గం
రూపంలో శేషాచలం కొండలను పోలి ఉండే ఉదయగిరి దుర్గం ఆయుర్వేద వనమూలికలకు నిలయం. అపార ఆయుర్వేద సంపదకు నెలవైన ఈ దుర్గం ఎంతో ప్రాశస్త్యం పొందినది. నల్లమల, వెలిగొండ, శ్రీశైలం అడవుల్లో లభించని అరుదైన అనేక రకాల ఔషధ మొక్కలు ఈ దుర్గంపై ఉన్నట్లు ఆయుర్వేద పరిశోధకులు గుర్తించారు. ఈ వనమూలికలు ఆయుర్వేద వైద్యానికి ఎంతో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు.
ఉదయగిరి: సముద్ర మట్టానికి 938 మీటర్ల ఎత్తులో గల ఉదయగిరి దుర్గం సంజీవకొండగా ప్రసిద్ధి పొందినదని స్థానికులు చెబుతుంటారు. ఈ దుర్గంపై ఆయుర్వేద మొక్కలకు కొదువలేదు. ప్రాచీన వైద్యవిధానాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆయుర్వేద వైద్యంతో ఎన్నో రోగాలు నయమైనట్లు ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అందుకే రాజుల కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు వైద్యులకు కూడా అంతుచిక్కని అనేక రోగాలు ఆయుర్వేద వైద్యం ద్వారా నయమవుతున్నాయి.
ఈ వైద్యానికి అవసరమైన ఎంతో విలువైన వనమూలికలు ఉదయగిరి దుర్గంపై ఉన్నప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇటీవల ఆయుర్వేద వైద్యంపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో ఈ వైద్యానికి డిమాండ్ ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యమిస్తూ విలువైన ఆయుర్వేద మందులను తయారు చేస్తూ వైద్యశాలలకు సరఫరా చేస్తోంది. ఆయుర్వేద వైద్యశాలల్లో బెడ్లు కూడా ఏర్పాటు చేసి పసుర్లు, తైలాలతో ప్రాచీన వైద్యసేవలు అందిస్తోంది. దీంతో ఈ వైద్యానికి పూర్వవైభవం తెచ్చేలా అడుగులు పడుతున్నాయి.
పరిశోధనలు
ఆయుర్వేద సంస్థల ప్రతినిధులు 30 ఏళ్ల క్రితమే ఉదయగిరి దుర్గాన్ని సందర్శించి అనేక ఔషధ మొక్కలను సేకరించారు. అనేక వనమూలికా మొక్కలపై పరిశోధనలు చేశారు. కర్ణాటకకు చెందిన ఆయుర్వేద డాక్టర్ అయ్యంగార్, నెల్లూరుకు చెందిన పి.చెంచలరావు పంతులు ఇక్కడి అడవుల్లో మొక్కలు సేకరించి తమ ఆయుర్వేద చికిత్సాలయాల్లో వినియోగించారని తెలుస్తోంది. ఇప్పటికీ స్థానికంగా ఉన్న అనేక మంది ఆయుర్వేద వైద్యులు కొండల్లో లభించే వనమూలికలను వైద్యానికి ఉపయోగిస్తున్నారు.
బ్రిటిష్ కాలంలోనే గుర్తింపు
ఉదయగిరి అడవులు, కొండల్లో ఉండే ఔషధ సంపద బ్రిటిష్ పాలకులే గుర్తించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ వనమూలికలపై వారు అనేక పరిశోధనలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఉదయగిరిలో ఒక ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటు చేసి వైద్యసేవలను కూడా అందించారు. మాదాల జానకిరామ్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయుర్వేద ఫార్మసీ ఏర్పాటుకు ప్రయత్నం చేసినా కార్యరూపం దాల్చలేదు. అటవీశాఖ ఆధ్వర్యంలో దుర్గంపల్లి పరిసర ప్రాంతాల్లో వనమూలికల మొక్కల సంరక్షణ కోసం కంచె కూడా ఏర్పాటు చేశారు. అయినా ఆశించిన ఫలితం లేదు. ఉదయగిరి దుర్గంలో ఉన్న అపారమైన వనమూలికా సంపదను సక్రమంగా వినియోగించుకోనేందుకు ఉదయగిరిలో ఆయుర్వేద కళాశాల, వైద్యశాల ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
అపార సంపద
ఆయుర్వేద వైద్యానికి ఉపయోగించే వనమూలికలు ఉదయగిరి అడవుల్లో, కొండల్లో, దుర్గంపై అపారంగా ఉన్నాయని తెలుస్తోంది. వైఎస్సార్ కడప, ప్రకాశం, శ్రీపొటి శ్రీరాములు నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఉన్న ఉదయగిరి, సిద్ధేశ్వరం, భైరవకోన అడవులు, కొండలు, కోనలు, గుట్టల్లో 162 రకాలకు పైగా ఔషధ మొక్కలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఉదరకోశ వ్యాధులు, పక్షవాతం, కామెర్లు, పైత్యం, పోలియో తదితర వ్యాధులను నయం చేసే వనమూలికలు ఈ ప్రాంతాల్లో దొరుకుతున్నాయి. దీర్ఘకాలిక క్యాన్సర్‌ను సైతం నయం చేసే ఔషధ మొక్కలు ఈ దుర్గంపై ఉన్నట్లు పలువురు పరిశోధకులు పేర్కొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
