
కాంపౌండ్ ఆర్చర్లకు నిరాశ
ప్రపంచ క్రీడలు
చెంగ్డూ (చైనా): భారత యువ ఆర్చర్ రిషభ్ యాదవ్ కాంస్య పతకంతో మెరిశాడు. ప్రపంచ క్రీడల్లో శనివారం జరిగిన పోటీల్లో మిగతా ఆర్చర్లకు నిరాశ ఎదురైంది. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్‌లో జరిగిన కాంస్య పతక పోరులో 22 ఏళ్ల రిషభ్ 149–147 స్కోరుతో భారత సీనియర్ సహచరుడు అభిషేక్ వర్మపై గెలుపొందాడు. తొలి సెట్‌లో కచి్చతమైన గురితో పదికి పది పాయింట్లు సాధించడంతో రిషభ్ 30–29తో ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండు, మూడు సెట్లలో ఇద్దరు 29–29, 30–30 స్కోర్లు చేశారు.
మళ్లీ నాలుగో సెట్‌లో రిషభ్ గురి అదరడంతో 30–29 స్కోరు సాధించాడు. దీంతో మొత్తం 119–117తో రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. ఆఖరి సెట్‌లో ఇద్దరు 30–30 స్కోరు సాధించడంతో రిషభ్‌కు పతకం ఖాయమైంది. సెమీఫైనల్లో అతను 145–147తో రెండు పాయింట్ల తేడాతో అమెరికన్ ఆర్చర్ కుర్టిస్ లి బ్రాడ్‌నాక్స్ చేతిలో ఓడిపోగా, అభిషేక్ వర్మ 145–148తో టాప్ సీడ్ మైక్ ష్లోసెర్ (నెదర్లాండ్స్) చేతిలో పరాజయం చవిచూశాడు.
మహిళల వ్యక్తిగత కాంపౌండ్ పోటీల్లో భారత్ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. 12వ సీడ్ పర్నిత్ కౌర్ 140–145తో కొలంబియాకు చెందిన నాలుగో సీడ్ అలెజాండ్రా వుస్‌క్వియానో చేతిలో, మూడో సీడ్ మధుర ధమన్‌గొంకర్ 145–149తో ఆరో సీడ్ లీసెల్ జాట్మా (ఈస్తోనియా) చేతిలో ఓడిపోయారు.
మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన అభిషేక్ వర్మ–మధుర జోడీ నిరాశపరిచింది. అనూహ్యంగా తొలిరౌండ్లోనే భారత ద్వయం 151–154తో దక్షిణ కొరియాకు చెందిన మూన్ యియున్–లీ వున్హో చేతిలో కంగుతింది. మిక్స్‌డ్ రికర్వ్‌లో భారత జోడీలు బరిలోకి దిగలేదు.