యో-యో టెస్టుకు రోహిత్ శ‌ర్మ‌..? అసలేంటి ఈ ప‌రీక్ష‌? | Rohit Sharma to Face Yo-Yo Test Ahead of Australia ODI Series, KL Rahul Also in Line | Sakshi
Sakshi News home page

IND vs AUS: యో-యో టెస్టుకు రోహిత్ శ‌ర్మ‌..? అసలేంటి ఈ ప‌రీక్ష‌?

Aug 27 2025 8:22 AM | Updated on Aug 27 2025 10:11 AM

Yo-Yo test lined up for KL Rahul And Rohit Sharma on Aug 30-31: Reports

టీమిండియా వ‌న్డే కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ద‌మ‌వ‌తుతున్నాడు. టెస్టుల‌కు, టీ20ల‌కు వీడ్కోలు ప‌లికిన రోహిత్‌.. ప్ర‌స్తుతం కేవ‌లం  వ‌న్డే ఫార్మాట్‌లో మాత్ర‌మే కొన‌సాగుతున్నాడు.  ఈ క్ర‌మంలో ఆక్టోబ‌ర్‌లో ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్‌లో హిట్‌మ్యాన్ ఆడ‌నున్నాడు.

అయితే ఆసీస్ ప‌ర్య‌ట‌న‌కు ముందు రోహిత్ శ‌ర్మ యో-యో టెస్టును ఎదుర్కొన్నాడు. అతడితో పాటు భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సైతం యో-యో పరీక్షకు హాజరు కానున్నాడు. వీరిద్దరికి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆగస్టు 30-31 మధ్య ఈ ఫిట్‌నెస్ టెస్టును నిర్వహించనున్నట్లు రేవ్‌స్పోర్ట్స్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.

అంతేకాకుండా ఆసీస్ ప‌ర్య‌ట‌న‌కు ముందు స్వ‌దేశంలో ఆస్ట్రేలియా-ఎతో జ‌రిగే అనాధికారిక వన్డే సిరీస్‌లో రోహిత్ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో చివ‌ర‌గా అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడిన రోహిత్‌.. ఆసీస్‌-ఎతో సిరీస్‌ను ప్రాక్టీస్‌గా ఉపయోగించుకోవాలని భావిస్తున్నడంట.

మరోవైపు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి కోహ్లి  తన ఫిట్‌నెస్ పరీక్షకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కోహ్లి ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్ కోసం తన ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడు. ప్రాతిష్టత్మక లార్డ్స్ మైదానంలో కోహ్లి శ్రమిస్తున్న ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

అసలేంటి ఈ యో-యో టెస్టు?
యో-యో టెస్టు.. క్రికెట్‌లో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను నిర్ధారించేందుకు నిర్వహించే ఓ పరీక్ష. సాకర్‌లో పాప్‌లార్ అయిన ఈ టెస్టును భారత క్రికెట్‌కు 2018లో అప్పటి స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ శంకర్‌ బసు పరిచియం చేశారు. ప్రధాన సిరీస్‌లు, ఐసీసీ టోర్నీలకు ముందు ఆటగాళ్ల ఎనర్జీని తెలుసుకునేందుకు ఈ టెస్టును బీసీసీఐ నిర్వహిస్తోంది. గతంలో ఈ పరీక్షను బీప్‌ టెస్ట్‌ లేదా లేజర్‌ టెస్టు అని పిలిచేవారు.

ఎలా నిర్వహిస్తారు?
20 మీటర్ల దూరంతో రెండు కోన్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందులో పాల్గొనే ప్లేయర్స్​ వాటి మధ్య పరుగెత్తాల్సి ఉంటుంది.  ఒక్కో పరుగుకు మూడు బీప్‌లు ఉంటాయి. మొదటి బీప్‌ వచ్చినపుడు ప్లేయర్​ పరుగు ఆరంభించి.. రెండో సారి సౌండ్ వచ్చేలోపు అవతలి కోన్‌కు చేరాలి. 

అయితే మూడో బీప్‌ సమయానికి ఆరంభ స్థానానికి చేరాల్సి ఉంటుంది. ఇలా ఒకసారి చేస్తే ఒక షటిల్‌ పూర్తి అయినట్లుగా పరిగణిస్తారు. ఒక షటిల్‌లో ఓ ప్లేయర్‌ 40 మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. లెవల్‌ పెరుగుతున్న కొద్దీ ఒకటి కంటే ఎక్కువ ష‌టిల్స్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. 

మొత్తంగా ఈ టెస్టులో ఆట‌గాళ్లు వేర్వేరు వేగాలతో  2 కి.మీ దూరాన్ని ప‌రిగెత్తాలి. ఈ దూరాన్ని ఫాస్ట్ బౌలర్లు 8 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉండ‌గా.. ఇతర ఆటగాళ్ళు 8 నిమిషాల 30 సెకన్లలో ప‌రిగెత్తాల్సి ఉంటుంది.

అలా అయితే ఫెయిల్‌?
కాగా మొదటి బీప్‌ వచ్చినపుడు ఫ‌స్ట్ కోన్ నుంచి ప‌రుగు మొద‌లు పెట్టిన ఆట‌గాడు రెండో బీప్‌ సమయానికి అవతలి ఎండ్‌కు వెళ్లాలి. ఒక‌వేళ రెండో బీప్‌ సమయానికి అవతలి ఎండ్‌కు వెళ్లలేకపోతే కచ్చితంగా మూడో బీప్ సమయానికి అయినా లక్ష్యాన్ని చేరాల్సి వుంటుంది.

లేకుంటే తొలి హెచ్చరికను జారీ చేస్తారు. అలా మూడు సార్లు స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్ నుంచి హెచ్చరికలు అందుకుంటే సదరు ప్లేయర్ యోయో టెస్టులో విఫలమైనట్లే. భారత క్రికెటర్లు యో-యో టెస్టులో పాస్‌ అవ్వాలంటే కచ్చితంగా 17:1 స్కోర్‌ సాధించాలి.

 గతంలో ఇది 16:1 ఉండేది. ఇక దాదాపు మూడు నెలల ఆటకు దూరంగా ఉంటున్న రోహిత్‌ ఈ యో-యో టెస్టును ఎలా నెట్టుకుస్తాడో వేచి చూడాలి. రోహిత్‌ శర్మ చివరగా 2023లో యోయో టెస్టులో పాల్గోనున్నాడు. రోహిత్‌ ఆ టెస్టును క్లియర్‌ చేసిన్పటకి అతడి స్కోర్‌ను మాత్రం వెల్లడించలేదు.
చదవండి: పూర్తి ఫిట్‌నెస్‌తో సిద్ధమయ్యా.. అక్కడ అంతా అద్భుతం: సూర్య
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement