
భారత టీ2020 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొత్త ఉత్సాహంతో మైదానంలోకి పునరాగమనం చేయబోతున్నాడు. స్పోర్ట్ హెర్నియాతో బాధపడుతుండటంతో ఐపీఎల్ ముగిసిన తర్వాత అతనికి మ్యూనిక్‌లో శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడు కోలుకున్న సూర్య పూర్తి ఫిట్‌నెస్‌తో ఆసియా కప్‌కు సన్నద్ధమయ్యాడు.
ఈ క్రమంలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో అతనికి రీహాబిలిటేషన్ సాగింది. "ప్రస్తుతం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. గత ఆరు వారాలుగా రీహాబిలిటేషన్ సాగింది. నాతో పాటు సీఓఈలో ఉన్నవారు నాకు తగిన విధంగా మార్గనిర్దేశనం చేశారు.
ఒక్కో వారం నా పురోగతిని చూసుకుంటూ ముందుకు వెళ్లాను. మానసికంగా కూడా నేను మెరుగయ్యాను. ఈ ప్రక్రియ అంతా సరైన రీతిలో సాగింది. నేను మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు దీనిని ఒక అవకాశంగా చూస్తున్నా’ అని సూర్యకుమార్ చెప్పాడు.
గతంలోనూ సూర్య హెర్నియా సర్జరీతో బాధపడగా, అంతకు ముందే అతని కాలి మడమ గాయాలకి కూడా శస్త్రచికిత్స జరిగింది. ‘గతానుభవం కారణంగా నేను కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనేది నాకు బాగా తెలుసు. కాబట్టి అన్నింటికీ సిద్ధమై ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లాను.
నా శరీరం ఎలా స్పందిస్తుందనేది సీఓఈ సిబ్బందికి బాగా తెలియడం సానుకూలంగా మారింది. ఫిజియో, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ దానికి అనుగుణంగానే ప్రణాళికలు రూపొందించారు. సీఓఈలో సౌకర్యాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి.
ఇలాంటివి నేను ఎప్పుడూ చూడలేదు. ఆటగాళ్ల కోణంలో చూస్తే వారి కోసమే ప్రత్యేకంగా రూపొందించిన కొత్త తరహా ఎక్విప్‌మెంట్‌లు చాలా ఉన్నాయి. ఎవరైనా ఇక్కడికి వస్తే వీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవచ్చు’ అని సూర్యకుమార్ వ్యాఖ్యానించాడు.
చదవండి: సానియాతో అర్జున్ టెండుల్కర్ నిశ్చితార్థం జరిగిందా?.. సచిన్ స్పందన ఇదే..