
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) ఇంట త్వరలోనే శుభకార్యం జరుగనుంది. సచిన్- అంజలిల కుమారుడు అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar) పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలు సానియా చందోక్‌తో అర్జున్ వివాహ నిశ్చితార్థం జరిగింది.
అయితే, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక గురించి ఇరు కుటుంబాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సచిన్ టెండుల్కర్ కుమారుడి నిశ్చితార్థం గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు.
అర్జున్ ఎంగేజ్‌మెంట్ నిజంగానే జరిగిందా?
సోషల్ మీడియా వేదికగా ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ నిర్వహించిన సచిన్ టెండుల్కర్‌ను అభిమానులు ప్రశ్నలు అడిగారు. ఇందులో ఓ ఫ్యాన్.. ‘‘అర్జున్ ఎంగేజ్‌మెంట్ నిజంగానే జరిగిందా?’’ అని ప్రశ్నించారు. ఇందుకు బదులుగా.. ‘‘అవును. నిశ్చితార్థం జరిగింది. అర్జున్ జీవితంలోని కొత్త దశను చూసేందుకు మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని సచిన్ సమాధానమిచ్చాడు.
సారా కంటే ముందే అర్జున్ పెళ్లి?
సచిన్- అంజలిల మొదటి సంతానంగా కుమార్తె సారా టెండుల్కర్ జన్మించింది. 27 ఏళ్ల సారా మోడల్‌గా, న్యూట్రీషనిస్టుగా రాణిస్తూనే.. ఇటీవలే పైలైట్స్ అకాడమీ (వెల్‌నెస్ సెంటర్) నెలకొల్పింది. కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఆమెకు.. పెళ్లి గురించి ప్రస్తుతం ఆలోచన లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమ్ముడు అర్జున్ టెండుల్కర్ అక్క సారా కంటే ముందే వివాహ బంధంలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఏడాది వ్యత్యాసం
ఇక సారా ప్రాణ స్నేహితుల్లో సానియా ఒకరు. అన్నట్లు సానియా అర్జున్ కంటే వయసులో ఏడాది పెద్ద. ఇక సారాతో పాటు సచిన్ కుటుంబంతోనూ సానియాకు చాలా ఏళ్లుగా సాన్నిహిత్యం ఉంది. ఇటీవల సారా పైలైట్స్ అకాడమీ ఓపెనింగ్‌లోనూ సచిన్- అంజలిలతో కలిసి పూజలో పాల్గొన్న సానియా.. కాబోయే వదిన సారాతో కలిసి రిబ్బన్ కూడా కట్ చేసింది.

క్రికెటర్‌గా పడుతూ.. లేస్తూ..
తండ్రి బాటలో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న పాతికేళ్ల అర్జున్ టెండుల్కర్ పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఆల్‌రౌండర్ అయిన అర్జున్.. దేశవాళీ క్రికెట్‌లో గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ గోవా తరఫున 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 532 పరుగులు సాధించడంతో పాటు.. 37 వికెట్లు కూల్చాడు.
అదే విధంగా.. 24 టీ20 మ్యాచ్‌లలో కలిపి 27 వికెట్లు తీయడంతో పాటు 119 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో 102 పరుగులు సాధించడంతో పాటు.. 25 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఐపీఎల్‌లో సచిన్ మెంటార్‌గా ఉన్న ముంబై ఇండియన్స్ తరఫున అర్జున్ టెండుల్కర్ 2023లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికి క్యాష్ రిచ్ లీగ్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన అర్జున్ టెండుల్కర్.. మూడు వికెట్లు తీయడంతో పాటు ఒక ఇన్నింగ్స్ ఆడి 13 పరుగులు చేశాడు.
చదవండి: ఫ్లాట్ కొన్న సచిన్ టెండుల్కర్ సతీమణి.. ‘కేవలం’ రూ. 32 లక్షలు!