
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) సతీమణి అంజలి టెండుల్కర్ ఫ్లాట్ కొన్నారు. ముంబైకి సమీపంలోని వివర్ ఏరియాలో చవకైన ధరకే ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నారు. ఇందుకు గానూ ఆమె రూ. 32 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.
ఈ ఫ్లాట్ విస్తీర్ణం కేవలం 391 చదరపు అడుగులు మాత్రమే. గతేడాది మే 30న అంజలి (Anjali) ఈ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆమె రూ. 1.92 లక్షలు మేర స్టాంపు డ్యూటీ.. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 30 వేలు చెల్లించినట్లు జాప్‌కీ.కామ్ వెల్లడించింది.
కాగా మహిళలు ఫ్లాట్లు కొనుగోలు చేస్తే స్టాంపు డ్యూటీ కింద ఒక శాతం రాయితీ ఉంటుంది. అంతేకాదు.. మహారాష్ట్రలో మహిళలు ఇంటి యజమానులుగా ఉంటే.. పట్టణాలు, జిల్లాలను బట్టి ఈ రాయితీ 5 నుంచి 7 శాతం వరకు ఉంటుంది.
సచిన్ ఆస్తి ఎంతంటే?
ఇరవై నాలుగేళ్లపాటు టీమిండియా క్రికెటర్‌గా కొనసాగిన సచిన్ టెండుల్కర్ తన సుదీర్ఘ కెరీర్‌లో లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు. అదే రేంజ్‌లో సంపదనూ పోగేసుకున్నాడు. ఓవైపు.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్‌గా వార్షిక జీతం, మ్యాచ్ ఫీజులు.. మరోవైపు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సదరు బ్రాండ్లకు వ్యాపార భాగస్వామిగా ఉండటం ద్వారా రెండు చేతులా సంపాదించాడు.
ఆటకు వీడ్కోలు పలికి పుష్కరం గడుస్తున్నా సచిన్ సంపాదన పెరుగుతూనే ఉంది. వివిధ నివేదికల ప్రకారం.. సచిన్ నికర ఆస్తుల విలువ రూ. 1250 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఇక సచిన్ కుటుంబం నివసించేందుకు బాంద్రాలో తన కలల సౌధాన్ని నిర్మించాడు. దీని విలువ రూ. 80 కోట్లకు పైమాటే!
అలాంటిది సచిన్ భార్య అంజలి మాత్రం ఇంత చవగ్గా ఫ్లాట్ కొనడం పట్ల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వివర్‌లో ఇంతటి చిన్న విస్తీర్ణంలో ఉండే ఫ్లాట్‌లను అద్దెల కోసం కొనుగోలు చేస్తారు చాలా మంది. స్టూడియోలు, సింగిల్ బెడ్‌రూమ్ రెంటల్స్ కోసం వినియోగిస్తారు.
క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలోనే..
క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలోనే తనకంటే ఐదేళ్లు పెద్దదైన అంజలి మెహతాను ప్రేమించిన సచిన్ టెండుల్కర్.. 1995లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె సారా, కుమారుడు అర్జున్ టెండుల్కర్ సంతానం.
ఇక ఇటీవల సచిన్- అంజలి దంపతుల కుమారుడు అర్జున్ టెండుల్కర్ వివాహ నిశ్చితార్థం జరిగింది. వ్యాపార దిగ్గజం రవి ఘామ్ మనుమరాలు సానియా చందోక్ మెడలో అర్జున్ మూడుముళ్లు వేయబోతున్నాడు. అర్జున్ అక్క సారాకు సానియా బెస్ట్ ఫ్రెండ్.
ఇదిలా ఉంటే.. అర్జున్ క్రికెటర్‌గా అదృష్టం పరీక్షించుకుంటుండగా.. సారా మోడల్, న్యూట్రీషనిస్ట్‌గా రాణిస్తోంది. ఇటీవలే ఆమె పైలైట్స్ స్టూడియో (వెల్‌నెస్ సెంటర్)ను ఆరంభించింది కూడా!..
అంతా ఆట వల్లే
అతి సాధారణ కుటుంబంలో జన్మించిన సచిన్ ఈ స్థాయికి చేరడానికి ఏకైక కారణం క్రికెట్. తన నైపుణ్యాలతో శతక శతకాల ధీరుడిగా ఈ ముంబైకర్ ప్రపంచ క్రికెట్‌లో ఆల్‌టైమ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. అలాగే ఆర్థికంగానూ ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు.
చదవండి: నేనెప్పుడూ అలా అనుకోలేదు.. తమ్ముడికి ఇష్టమే: సారా టెండుల్కర్