WTC Final: అతడు రీ ఎంట్రీ ఇస్తే సంతోషిస్తా! టీమిండియా గెలవాలని కోరుకుంటున్నా.. కానీ: గంగూలీ

WTC Final Ganguly: Would Be Happy If He Got Chance Want India To Win But - Sakshi

WTC Final 2021-23- Ganguly Prediction: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్ నేపథ్యంలో టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ వృద్ధిమాన్‌ సాహా పునరాగమనం చేస్తే బాగుంటుందని మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో అనుభవజ్ఞుడైన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సేవలు ఉపయోగించుకోవాలని పరోక్షంగా సూచించాడు. ఆ దిశగా టీమిండియా సెలక్టర్లు యోచన చేయాలని విజ్ఞప్తి చేశాడు.

టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లండ్‌ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్‌- 2021-23 జరుగనున్న విషయం తెలిసిందే. జూన్‌ 7న మ్యాచ్‌ మొదలుకానున్న ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇక స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ యాక్సిడెంట్‌ కారణంగా జట్టుకు దూరమయ్యాడన్న సంగతి తెలిసిందే.

పంత్‌, రాహుల్‌ దూరం
ఈ క్రమంలో.. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సందర్భంగా ఆంధ్ర క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌.. రిషభ్‌ పంత్‌ స్థానంలో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అదే విధంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. 

అయితే, మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమైన తరుణంలో.. ఇంతవరకు ఒక్క అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌ కూడా ఆడని ఇషాన్‌ కిషన్‌కు పిలుపునిచ్చారు సెలక్టర్లు. తద్వారా అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. కేఎస్‌ భరత్‌కు బ్యాకప్‌గా టెస్టుల్లో అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ ఇషాన్‌ను ఎంపిక చేయడాన్ని తప్పుబట్టారు.


వృద్ధిమాన్‌ సాహా

అతడు వస్తే సంతోషిస్తా
ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ బాస్‌ సౌరవ్‌ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇది పూర్తిగా సెలక్టర్ల నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సాహాకు అవకాశమిస్తే మాత్రం నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. టీమిండియా స్వదేశంలో ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ గెలిచినపుడు కేఎస్‌ భరత్‌ వికెట్‌ కీపర్‌గా ఉన్నాడు.

అంతకంటే ముందు వృద్ధిమాన్‌ టెస్టుల్లో ఆడాడు. అంతకు మునుపు రిషభ్‌ పంత్‌ ఉండేవాడు. అందుకే అప్పుడు సాహా అవకాశాలు కోల్పోయాడు. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్‌ నేపథ్యంలో సాహాకు పిలుపు వస్తే బాగుంటుంది. అతడు పునరాగమనం చేస్తే నేను సంతోషిస్తాను. సెలక్టర్లు ఈ విషయం గురించి ఆలోచిస్తే బాగుంటుంది’’ అని దాదా సూచించాడు.

టీమిండియా గెలవాలని కోరుకుంటున్నా.. కానీ
ఇక టీమిండియా డబ్ల్యూటీసీ ట్రోఫీ గెలవాలని కోరుకుంటున్నానన్న గంగూలీ.. ఆసీస్‌తో పోటీ అంటే కాస్త కష్టమేనన్నాడు. ‘‘మ్యాచ్‌ అద్భుతంగా సాగుతుందని అనుకుంటున్నా. ఎవరు గెలుస్తారో తెలియదు. నేనైతే భారత్‌ గెలవాలని కోరుకుంటున్నా. కానీ అవకాశాలు మాత్రం 50-50గా ఉన్నాయి’’ అని దాదా అభిప్రాయపడ్డాడు. 

కాగా తొట్టతొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన టీమిండియా టైటిల్‌ చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వృద్ధిమాన్‌ సాహా ప్రస్తుతం ఐపీఎల్‌-2023తో బిజీగా ఉన్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌గా ఉన్న సాహా.. 15 ఇన్నింగ్స్‌లలో కలిపి 299 పరుగులు చేశాడు. ఇక 38 ఏళ్ల సాహా ఆఖరి సారిగా న్యూజిలాండ్‌తో సిరీస్‌ సందర్భంగా టీమిండియా తరఫున 2021లో టెస్టు ఆడాడు. మొత్తంగా 40 టెస్టులాడి 1353 పరుగులు సాధించాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌-2023: బీసీసీఐ ప్రకటించిన జట్టు ఇదే 
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్‌ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌).
స్టాండ్‌ బై ప్లేయర్లు: రుతురాజ్‌ గైక్వాడ్‌, ముకేశ్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌.

చదవండి: గంభీర్‌ ఓ లెజెండ్‌.. ఎన్నో విషయాలు నేర్చుకున్నా.. ఇక మైదానంలో..
IPL 2023: ముంబై గెలిచిందా సరికొత్త చరిత్ర.. టైటిల్‌ నెగ్గే విషయంలో కాదు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top