#WTC Final: రాహుల్‌ స్థానంలో యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. బీసీసీఐ ప్రకటన

WTC Final: BCCI Announces Ishan Kishan As Replacement Of KL Rahul - Sakshi

#WTC Final 2023: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జట్టులో యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌కు చోటు దక్కింది. కేఎల్‌ రాహుల్‌ స్థానంలో అతడిని జట్టుకు ఎంపిక చేసినట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి తెలిపింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 గెలిచిన టీమిండియా.. ఆసీస్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జూన్‌ 7-11 వరకు టీమిండియా- ఆస్ట్రేలియా తుదిపోరులో పోటీ పడనున్నాయి. ఇంగ్లండ్‌ వేదికగా ఇరు జట్లు టైటిల్‌ వేటలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ ఆసీస్‌తో తలపడే భారత జట్టును ప్రకటించింది.

రాహుల్‌ అవుట్‌
అయితే, ఐపీఎల్‌-2023లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌ సందర్భంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌, టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయపడ్డాడు. కుడి తొడ పైభాగంలో నొప్పి తీవ్రమైన నేపథ్యంలో సర్జరీ చేయించుకునేందుకు నిశ్చయించుకున్నాడు.

ఈ క్రమంలో ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి దూరమైన అతడు డబ్ల్యూటీసీ ఫైనల్‌ నుంచి కూడా వైదొలిగినట్లు బీసీసీఐ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అతడి స్థానంలో ఇషాన్‌ కిషన్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసినట్లు తెలిపింది. 

వాళ్లిద్దరి సంగతి ఏంటి?
ఇక ఎడమ భుజానికి గాయం కావడంతో ఇబ్బంది పడుతున్న పేసర్‌ జయదేవ్‌ ఉనాద్కట్‌ ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. అతడి గాయం తీవ్రతపై పూర్తిగా స్పష్టత వచ్చిన తర్వాతే డబ్ల్యూటీసీ ఫైనల్‌ జట్టులో కొనసాగే అంశంపై క్లారిటీ వస్తుందని తెలిపింది.

ముగ్గురికి ఛాన్స్‌
అదే విధంగా మరో పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ కూడా కేకేఆర్‌ వైద్య బృందం పర్యవేక్షణలో కోలుకుంటున్నాడన్న బీసీసీఐ.. తమ మెడికల్‌ టీమ్‌ ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటోందని తెలిపింది. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ వెన్ను నొప్పి కారణంగా దూరమైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో స్టాండ్‌బై ప్లేయర్లుగా రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లతో పాటు బౌలర్‌ ముకేశ్‌ కుమార్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఇంతవరకు టీమిండియా తరఫున ఒక్క టెస్టు కూడా ఆడని ఇషాన్‌ ఏకంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ ప్రధాన జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం.

ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడేందుకు బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్‌ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌).
స్టాండ్‌ బై ప్లేయర్లు: రుతురాజ్‌ గైక్వాడ్‌, ముకేశ్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌.

చదవండి: లక్నో సూపర్‌ జెయింట్స్‌కు మరో బిగ్‌ షాక్‌.. స్టార్‌ ఆటగాడు దూరం! 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top