‘అతను కెప్టెన్‌ పగ్గాలు చేపట్టినా ఆశ్చర్యం లేదు’

Wont Be Surprised If Gill Leads A Franchise, Simon Doull - Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌పై ప్రశంసలు కురుస్తుండగా, కెప్టెన్‌గా ఉన్న దినేశ్‌ కార్తీక్‌పై విమర్శలు వస్తున్నాయి. వరుస మ్యాచ్‌ల్లో కార్తీక్‌ విఫలం కావడంతో అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించాలంటూ విశ్లేషకులు మండిపడుతున్నారు. అదే సమయంలో గిల్‌ను కేకేఆర్‌ కెప్టెన్‌ను చేయాలంటూ మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు శుబ్‌మన్‌ గిల్‌కు మద్దతు తెలిపే వారిలో న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ సైమన్‌ డౌల్‌ కూడా చేరిపోయారు. ప్రస్తుతానికి శుబ్‌మన్‌ గిల్‌ జట్టులో కీలక పాత్ర పోషించినా ఫ్రాంచైజీ పగ్గాలు చేపట్టడానికి రెండు-మూడేళ్లు ఆగాల్సిందేనని అంటున్నాడు.  ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీకి కెప్టెన్‌ అయ్యే అన్ని అర్హతలు గిల్‌కు ఉన్నాయన్నాడు. మరో రెండు-మూడేళ్లలో గిల్‌ ఐపీఎల్‌ల్లో ఒక జట్టుకు సారథి అయినా పెద్దగా ఆశ్చర్య పడాల్సిన విషయం ఏమీ ఉండదన్నాడు. (చదవండి:టాప్‌-20 ఫాస్టెస్ట్‌ బాల్స్‌.. ఒక్కడే 16)

ప్రస్తుతం 21 ఒడిలో ఉన్న గిల్‌.. 23 ఏళ్ల వయసులో ఫ్రాంచైజీ కెప్టెన్‌ అయ్యే అవకాశాలు లేకపోలేదన్నాడు. కాగా, దినేశ్‌ కార్తీక్‌, ఇయాన్‌ మోర్గాన్‌, కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌లతో ఎక్కువ సమయం గడిపి వారి నుంచి కొన్ని టెక్నిక్స్‌ తెలుసుకోవాలని సూచించాడు. గత 7-9 ఏళ్లలో మెకల్లమ్‌ది క్రికెట్‌లో ఒక ప్రత్యేక శైలి అని, అదే సమయంలో మోర్గాన్‌ కూడా మంచి కెప్టెన్‌ అని కొనియాడాడు. వీరి నుంచి కొత్త విషయాలు తెలుసుకోవడానికి గిల్‌ యత్నించాలన్నాడు. ఈ టోర్నీలో గిల్‌ చక్కటి ఆరంభాన్ని ఇస్తూ జట్టుకు ఉపయోగపడుతున్నాడన్నాడు. ఒక్క తొలి మ్యాచ్‌లోనే విఫలమైన గిల్‌.. ఆపై వరుస రెండు గేమ్‌ల్లో రాణించాడన్నాడు. తన సహజసిద్ధమైన ఆడటానికే గిల్‌ మొగ్గుచూపాలని సైమన్‌ డౌల్‌ తెలిపాడు.  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో కేకేఆర్‌ ఆడిన తొలి మ్యాచ్‌ గిల్‌ అజేయంగా 70 పరుగులు సాధించి కీలక పాత్ర  పోషించగా, రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన బుధవారం నాటి మ్యాచ్‌లో 34 బంతుల్లో 47 పరుగులు చేసి మరో మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ కేకేఆర్‌ విజయం సాధించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top