
భారత కొత్త టెస్టు కెప్టెన్ ఎవరన్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. టీమిండియా కెప్టెన్‌గా అంతా ఊహించినట్లే శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. అయితే ఇప్పుడు టీమిండియా ఓపెనర్ ఎవరన్న ప్రశ్న అందరిలోనూ మొదలైంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత ఇన్నింగ్స్‌ను జైశ్వాల్‌తో కలిసి ఎవరు ఆరభిస్తారన్న చర్చ నడుస్తోంది. భారత ఓపెనర్ స్దానం కోసం ముగ్గురు పోటీలో ఉన్నారు. వారే స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, తమిళనాడు సంచలనం సాయిసుదర్శన్, బెంగాల్ మాజీ కెప్టెన్ అభిమాన్యు ఈశ్వరన్.
కేఎల్ రాహుల్ వైపే మొగ్గు..?
మిగితా ఇద్దరితో పోలిస్తే రాహుల్‌కే భారత ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహుల్ ఒక సెల్ప్‌లెస్ ఆటగాడు. 2014లో అరంగేట్రం చేసినప్పటి నుంచి రాహుల్ ఓపెనర్‌గాను, మిడిలార్డర్‌లోనూ తన సేవలను అందించాడు. ఆఖరికి ఆరో స్ధానంలో కూడా బ్యాటింగ్ చేసిన సందర్బాలు ఉన్నాయి. గతంలో టెస్టుల్లో భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అనుభవం రాహుల్‌కు ఉంది.
టెస్టుల్లో అతడికి ఓపెనర్‌గా రెండు సెంచరీలు ఉన్నాయి. 2018-21 కాలంలో టెస్టుల్లో టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్.. 18 ఇన్నింగ్స్‌లలో 37.31 సగటుతో 597 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా 83 ఇన్నింగ్స్‌లలో 35.03 సగటుతో 2803 పరుగులు చేశాడు. అదేవిధంగా ఇంగ్లండ్ వంటి బౌన్సీ కండిషన్స్‌లో నిలకడగా బ్యాటింగ్ చేసే సత్తా కూడా రాహుల్‌కు ఉంది. దీంతో రాహుల్-జైశ్వాల్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే సూచనలు కన్పిస్తున్నాయి.
సాయిసుదర్శన్ మరో అప్షన్..!
ఒక వేళ కేఎల్ రాహల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలని టీమ్ మెనెజ్‌మెంట్ భావిస్తే.. యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ను ఓపెనర్‌గా పంపే అవకాశముంటుంది. సాయి సుదర్శన్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున సంచలనాలు సృష్టించాడు. వైట్ బాల్ క్రికెట్‌లోనూ కాదు రెడ్ బాల్ క్రికెట్‌లో కూడా సుదర్శన్‌ను తనను తాను నిరూపించుకున్నాడు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతడికి మెరుగైన రికార్డు ఉంది. 2022-25 కాలంలో 49 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్.. 39.93 సగటుతో 1957 పరుగులు చేశాడు. అందులో 7 హాఫ్ సెంచరీలు, 5 శతకాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా అతడికి ఉంది. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సర్రే తరపున ఆడాడు. ఈ తమిళనాడు బ్యాటర్ కౌంటీల్లో 8 ఇన్నింగ్స్‌లలో 35.12 సగటుతో 281 పరుగులు చేశాడు.
అభిమన్యు ఈశ్వరన్..
భారత జట్టు మెనెజ్‌మెంట్‌కు ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్ రూపంలో మరో అప్షన్ ఉంది. దశాబ్ద కాలంగా దేశీయ క్రికెట్‌లో పరుగులు వరద పారిస్తున్న ఈశ్వరన్.. ఇప్పటివరకు భారత జట్టు తరపున అరంగేట్రం చేయలేదు. పలుమార్లు భారత జట్టు ఎంపికైనా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కలేదు. ఒకవేళ ఇంగ్లండ్ టూర్‌లో అతడు అరంగేట్రం చేస్తే.. కచ్చితంగా జైశ్వాల్ ఓపెనింగ్ పార్టనర్ అభిమన్యు అనే చెప్పాలి.
ఎందుకంటే అతడికి అపారమైన అనభవం ఉంది. ఇప్పటివరకు 101 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఈశ్వరన్.. 48.87 సగటుతో 7674 పరుగులు చేశాడు. అతడి పేరిట 27 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా ప్రధాన సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో ఇండియా-ఎ టీమ్ కెప్టెన్‌గా అభిమన్యు వ్యవహరించనున్నాడు. ఈ అనాధికారిక సిరీస్‌లో అభిమన్యు రాణిస్తే.. ప్రధాన సిరీస్‌లో కూడా అడే అవకాశముంది.
చదవండి: Shreyas Iyer: కెప్టెన్ అవుతాడన్నారు.. కట్ చేస్తే! ఇప్పుడు టీమ్‌లోనే నో ఛాన్స్